కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్ సవాల్ విసిరారు.దమ్ము, ధైర్యముంటే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖను మధుసూదనాచారికి సమర్పించాలని అన్నారు . గురువారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన, పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని ఈసాలతక్కళ్లపల్లి గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. ఉట్టికి ఎగురలేని వాడు, స్వర్గానికి ఎగిరినట్టు రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నాడన్నారు. రాజీనామా లేఖ ఏపీ సీఎంకు కాకుండా తెలంగాణ స్పీకర్‌కు ఇవ్వాలన్న సోయి కూడా లేదన్నారు. కాంగ్రెస్ ఎంతమంది రేవంత్‌రెడ్డిలను తెచ్చినా సీఎం కేసీఆర్‌కు సరితూగరన్నారు. అసెంబ్లీలో ఎంఐఎం ఫ్లోర్‌లీడర్ అసదుద్దీన్ ఒవైసీ, కేసీఆర్‌ను దేశంలోనే నెంబర్1 సీఎం అని ప్రశంసించారని గుర్తుచేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు గానీ, సింగరేణి ఎన్నికలుగానీ, మెదక్, వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికలు, నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో గానీ, టీఆర్‌ఎస్ ఘనవిజయం సాధించినా, ప్రతిపక్షాలు కండ్లు తెరువకపోవడం మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. రాబోయే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 107 సీట్లల్లో ఘనవిజయం సాధిస్తుందని తటస్థ సర్వే ద్వారా వెల్లడైనట్టు చెప్పారు.