బంగారం, మాదకద్రవ్యాల అక్రమ తరలిపునకు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం అడ్డాగా మారుతోంది. తాజాగా బుధవారం వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు దాదాపు రూ.5.35కోట్లు విలువజేసే డ్రగ్స్, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి కొలంబో వెళ్లాల్సిన విమాన ప్రయాణికుల వద్ద చేపట్టిన తనిఖీల్లో రామనాథపురానికి చెందిన అమీర్ షాజహాన్ ప్రైవేట్ భాగాల పరిమాణం అసాధారణంగా ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 100గ్రామల హెరాయిన్‌ను కండోమ్లో దాచి, ధరించినట్లు తనిఖీలో తేలింది. అంతర్జాతీయ మార్కెట్లో దాని విలువ రూ.4కోట్ల వరకూ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. చెన్నైలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ ఉద్యోగి అయిన అతడిని మాదకద్రవ్యాల అక్రమ తరలింపు నియంత్రణ విభాగం అధికారులకు అప్పగించారు.
మరో ఘటనలో, దుబాయ్ నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికుల వద్ద చేపట్టిన తనిఖీల్లో ఇద్దరు మహిళలు తమ లగేజీలో దాచి ఉంచిన 4.5కిలోల బంగారు కడ్డీలను అధికారులు గుర్తించారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ.1.35కోట్లు ఉంటుందని అంచనా. అరెస్టయిన వారిద్దరూ కేరళ రాష్ట్రానికి చెందిన అధిరవ్ వర్గీస్, జెస్సీ వర్గీస్‌గా గుర్తించారు.