నార్నె శ్రీనివాసరావు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మామగా సుపరిచితుడు. అంతేగాక తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు దూరపు బంధువు కూడా. ఆ బంధుత్వంతోనే తారక్ కు నార్నె కూతురినిచ్చి పెళ్లి చేశారని అంటారు. అయితే గత కొంతకాలంగా అయితే నార్నె శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీతో అంత సన్నిహితంగా లేరని స్పష్టం అవుతోంది. ప్రత్యేకించి తారక్ రాజకీయ వారసత్వానికి తెలుగుదేశంలో ఎలాంటి అవకాశం లేకపోవడం, తెలుగుదేశం పార్టీ వారసత్వ అధికారాలు నారా లోకేష్ బాబుకే దక్కే అవకాశాలు కనిపిస్తుండటంతో.. తారక్‌కు టీడీపీకి దూరం పెరిగింది. ఆ ప్రభావం సహజంగానే ఆ హీరోకి పిల్లనిచ్చిన మామ నార్నె మీద కూడా పడింది.
ఈ నేపథ్యంలో భవిష్యత్తు రాజకీయ సమీకరణాలు ఆసక్తిదాయకంగా మారనున్నాయనే మాట వినిపిస్తోంది. ప్రత్యేకించి నార్నె శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయని, ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. గుంటూరు జిల్లా చిలకలూరి పేట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి నార్నె పోటీ చేసే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతుండటం గమనార్హం. నార్నె సొంత జిల్లా గుంటూరే. ఈ నేపథ్యంలో ఆయన ప్రత్యక్ష పోటీ గురించి ఈ ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైసీపీ నుంచి గత ఎన్నికల్లో మర్రి రాజశేఖర్ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. మర్రి రాజశేఖర్ మీద పుల్లారావు వరసగా రెండు సార్లు విజయం సాధించారు. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా మార్పుకు సానుకూలంగానే ఉందని, ఎన్టీఆర్ మామ వచ్చి చేరితే ఆయనకు టికెట్ ఖరారే అనే మాట వినిపిస్తోంది.