ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత మూడు రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే.అయితే జగన్ నిర్వహిస్తున్న ఈ పాదయాత్రలో రాఘవేంద్ర అనే వ్యక్తి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు .అసలు ఈ రాఘవేంద్ర ఎవరు ..ఎందుకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారో ఒక లుక్ వేద్దాం .అసలు విషయానికి వస్తే సంకల్పం బలంగా ఉండాలేగానీ సాధ్యం కానిదేదీ లేదని అమలాపురం యువకుడు బాసిన రాఘవేంద్ర అంటున్నారు.
తనకు కంటి చూపు లేకున్నా, తనకెంతో ఇష్టమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తలపెట్టిన పాదయాత్రలో పాల్గొని, ఆయన వెంట ఇచ్ఛాపురం దాకా నడవాలన్న తపన మాత్రం మెండుగా ఉందని ఆయన చెప్పారు. ప్రజాసంకల్ప యాత్రలో ఉత్సాహంగా పాల్గొంటూ వేలాది మంది అభిమానులతోపాటు నడక సాగిస్తున్న రాఘవేంద్రను బుధవారం ‘సాక్షి’పత్రిక పలకరించింది.
తాను తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి వచ్చానని తెలిపారు. తన కళ్లకు చిన్నప్పుడే రెటినైటిస్ పిగ్మంటోసా వ్యాధి సోకడంతో రెండు కళ్లల్లోనూ రెటీనా పనిచేయక చూపు కోల్పోయానన్నారు. సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన తనకు మొదటి నుంచీ ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు జగన్ అంటే ఎంతో అభిమానమని తెలిపాడు .ప్రజల కోసం ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభిస్తున్నానని జగనన్న ప్రకటించగానే తాను కూడా ఆయనతో కలిసి 3,000 కిలోమీటర్లు నడవాలని నిర్ణయించుకున్నానని రాఘవ ఈ సందర్భంగా వివరించారు.