ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన “ప్రజా సంకల్ప యాత్ర”లో భాగంగా కడప జిల్లా యర్రగుంట్ల నాలుగురోడ్ల కూడలి జనసంద్రమైంది. వైయస్ జగన్ కు మద్దతుగా వేలాది మంది ప్రజలు కదం తొక్కారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం అయన మాట్లాడుతూ … రాష్ట్రంలో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అసమర్థ పాలన వల్ల నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సుదీర్ఘ పాదయాత్ర ప్రారంభించాల్సి వచ్చిందని జగన్ అన్నారు . రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు చంద్రబాబు పాలనలో మోసపోయారని పేర్కొన్నారు . రైతులు, చేనేత కార్మికులు, యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ప్రజలకు భరోసా ఇచ్చేందుకే తాను పాదయాత్ర ప్రారంభించానన్నారు. ‘ఏడాది తర్వాత మనందరి పాలన వస్తుంది. ఆ పాలనలో మంచి రోజులు వస్తాయి’ అని ఆయన పునరుద్ఘాటించారు.అందరి జీవితాల్లో వెలుగు నింపేందుకే నవరత్నాలను ప్రకటించానని.. ప్రజల సలహా మేరకు వాటిని మరింత మెరుగుపరుస్తానని ఆయన చెప్పారు.
అధికారంలోకి వస్తే
చంద్రబాబు పాలనలో రుణమాఫీ అమలు సరిగ్గా అమలు కావటం లేదంటూ ఈరోజు (గురువారం) ఉదయం కొందరు రైతులు తనను కలిసిన విషయాన్ని గుర్తు చేసిన జగన్.. అధికారంలోకి వస్తే ప్రతి రైతు ముఖంలో చిరునవ్వు తీసుకొస్తానని చెప్పారు. ఈ నాలుగేళ్ల బాబు పాలనలో బ్యాంకుల్లో పెట్టిన బంగారం బయటకు వచ్చిందా? అని ఆయన రైతులనుద్దేశించి ప్రశ్నించారు. గిట్టుబాటు ధర లభించక రైతులు రోడ్డున పడ్డారని.. వారి సంక్షేమం కోసమే రైతు భరోసా కార్యక్రమాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ప్రతి పంటకు ముందుగానే ధర ప్రకటించి అదే ధరకు కొనుగోలు చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఎంత రుణం ఉంటే అంత డబ్బును చేతికే అందిస్తామని పేర్కొన్నారు. నాలుగు విడతల్లో రైతులకు రూ.50 వేలు ఇస్తామని చెప్పారు.