16,879 చేనేత మగ్గాలు, 49,112 మరమగ్గాల నేతన్నల మనసు తెలిసిన సర్కార్ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణలో పరిపాలిస్తోందని రాష్ట్ర చేనేత,జౌళి శాఖ, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. చేనేత మరియు మరమగ్గాల కార్మికుల సంక్షేమ కార్యక్రమాలు మరియు ఋణ మాఫీ గురించి ప్రకటన చేస్తూ మంత్రి కేటీఆర్ పలు అంశాలు వివరించారు.
మంత్రి కేటీఆర్ ప్రకటన ఈ విధంగా సాగింది. “వ్యవసాయం తర్వాత మనదేశంలో అతి పెద్ద ఉపాధి కల్పన రంగం చేనేత-జౌళి. విస్తృతమైన ఉపాధి అవకాశాలను కల్పించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఈ రంగం చేయూతను ఇస్తుంది. అయితే కొన్ని దశాబ్దాల నుంచి గత ప్రభుత్వాలకు ఈ రంగం పైన అవగాహన లేకపోవడం వల్ల ఎన్నో ఒడిదుడుకులకు లోనైంది. తగినంత ముడిసరుకు దొరకకపోవడం, సరైన మార్కెటింగ్ సదుపాయం లేకపోవడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో వెనకబడడంతో పాటు మిల్లుల నుంచి వస్తున్న తీవ్రమైన పోటీతో చేనేత రంగం తీవ్రంగా ప్రభావితం అయింది. ఇందుకు తెలంగాణ అతీతమేమి కాదు. 16,879 చేనేత మగ్గాలు, 49,112 మరమగ్గాలతో పాటు ఈ రంగంపై సంపూర్ణ అవగాహన ఉన్న ప్రభుత్వం తెలంగాణలో ఉంది. ఈ రంగంలోని మేధావులు, నిపుణులు, స్వచ్చంద సంస్థలతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులతో పలు దఫాలుగా చర్చించిన ప్రభుత్వం చేనేతరంగం సమగ్రాభివృద్ధే లక్ష్యంగా అవసరమైన చర్యలు తీసుకుంది.
తగినంత బడ్జెట్ కేటాయింపులతో పాటు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందితేనే సమస్యల ఊబినుంచి చేనేత రంగం బయటపడుతుంది. ఈ వాస్తవం తెలుసుకాబట్టే 2017-18 సంవత్సరానికి ఎన్నడూ లేనివిధంగా 1270 కోట్ల రూపాయల (సాధారణ బడ్జెట్-70 కోట్లు, ప్రత్యేక బడ్జెట్ 1200 కోట్లు) ను ప్రభుత్వం కేటాయించింది. కాలం చెల్లిన సాంకేతిక పరిజ్ఞానం స్థానంలో ఆధునిక పరిజ్ఞానాన్ని అందించడం, ఈ రంగాన్ని నమ్ముకున్న నేత కార్మికులకు స్థిరమైన ఉపాధి దొరికేలా చూడడం, ఒకవేళ ఎవరైనా ప్రత్యామ్నాయ ఉపాధి కోరుకుంటే వారికి తగిన ఉపాధి మార్గాలు చూపించడం, ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం, బ్రాండ్ ప్రమోషన్ తో ఈ రంగానికి మరింత ప్రచారం తేవడం ఈ కేటాయింపుల యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
నేతన్నకు చేయూత (థ్రిఫ్ట్ పథకం):
గతంలోఈ పథకం కింద సహకార సంఘంలోని నేతకార్మికులు ఒక నెలలో పొందే కూలీలో 8% వాటాను బ్యాంకులో జమ చేస్తే, తనవంతుగా రాష్ట్ర ప్రభుత్వం మరో 8% జమ చేసేది. అయితే దీర్ఘకాలంలో నేతన్నలకు ప్రయోజనకరంగా ఉండే ఈ పథకం పరిధితో పాటు విస్తృతిని కూడా మా ప్రభుత్వం పెంచింది. దీని ప్రకారం ఒక నెలలో పొందే కూలీలో 8% వాటాను నేతన్న జమ చేస్తే, ప్రభుత్వం 16% జమచేస్తుంది.
గతంలో కేవలం సహకార సంఘంలో ఉన్న నేతన్నలకే ఈ పథకం వర్తించేది. కానీ ఇప్పుడు సహకార సంఘంలో లేనివారు కూడా ఈ పథకం ప్రయోజనాలు పొందవచ్చు. వీళ్లతో పాటు డైయింగ్, డిజైనింగ్, వార్ఫింగ్, వైండింగ్, సైజింగ్ వంటి చేనేత అనుబంధ కార్మికులు కూడా ఈ పథకానికి అర్హులవుతారు. నేతన్నల సామాజిక, ఆర్థిక భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చే ఈ పథకానికి 60కోట్ల రూపాయలను విడుదల చేసాము. ఈ పథకంతో ఇప్పటివరకు (6,445) మంది నేతన్నలు లబ్ది పొందారు.
మొదటిసారిగా మరమగ్గాల కార్మికులకు కూడా థ్రిఫ్ట్ పథకాన్ని వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నెలకు వచ్చే కూలీలో 8% వాటాను కార్మికుడు జమచేస్తే, తన వాటాగా ప్రభుత్వం కూడా మరో 8% జమచేస్తుంది. పదివేల మరమగ్గ కార్మికులు ఈ పథకంతో ప్రయోజనం పొందుతారు. ఇందుకోసం 15 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది.
వేతన పెరుగుదల-ఇన్ పుట్ సబ్సిడీ:
చేనేత సహకార సంఘంలోని సొసైటీలు, కార్మికులు కొనుగోలు చేసే నూలు, సిల్క్, ఉన్ని, డై, రసాయనాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 20% సబ్సిడీని ఇస్తుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం10% సబ్సిడీ అదనం. అయితే నేత కార్మికుల ఆదాయాన్ని పెంచే చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూలు, సిల్క్, ఉన్ని, డై, రసాయనాల కొనుగోలుపై ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీని 20% నుంచి 40% కి పెంచింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 10% సబ్సిడీ కూడా ఎప్పటిలాగానే లభిస్తుంది. ఈ పథకంతో చేనేత, అనుబంధ కార్మికులకు 35% అదనపు ఆదాయం లభిస్తుంది. ఆయా సొసైటీలకు 5% ఆదాయం సమకూరుతుంది. ఈ పథకం కోసం 100 కోట్ల రూపాయలు కేటాయించాము.
వస్త్రముల కొనుగోలు పథకం:
చేనేత కార్మికుల సహకార సంఘాల నుంచి TSCO ప్రస్తుతం 50 కోట్ల రూపాయల విలువైన సాధారణ/యూనిఫాంలను కొనుగోలు చేస్తోంది. చేనేత ఉత్పత్తుల విస్తరణ, డిజైన్ ను మెరుగుపరచడం, బ్రాండ్ ప్రమోషన్ చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని మగ్గాల నుంచి వస్త్రాలను కొనేందుకు TSCO ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. చేనేత ఉత్పత్తుల కొనుగోలు కోసం 127 కోట్ల రూపాయలు, హస్తకళల అభివృద్ధి కోసం ఇంకో 20 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. దీంతో పాటు చేనేత ఉత్పత్తుల బ్రాండ్ ప్రమోషన్, మార్కెటింగ్ సదుపాయాల కోసం 11 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దీంతోపాటు ప్రభుత్వ పాఠశాలల యూనిఫారంలను, ఇతర శాఖలకు అవసరమైన వస్త్రాలు మరియు బతుకమ్మ చీరల కొనుగోలుకు 240 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది.
NHDP క్రింద బ్లాక్ లెవెల్ క్లస్టర్లు:
జాతీయ చేనేత అభివృద్ధి పథకం క్రింద 10.19కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్రానికి మొత్తం (8) బ్లాక్ లెవెల్ క్లస్టర్లు మంజూరు అయినాయి. ఆలేరు, కమలాపూర్, వెల్టూర్, ఆర్మూర్, శాయంపేట్, కనుకుల, బూదాన్ పోచంపల్లి మరియు వేములవాడ లోని 2602 చేనేత కార్మికులకు లబ్ది చేకూరుతుంది. ఈ పథకం క్రింద వీవింగ్, డిజైనింగ్ మరియు రంగుల అద్దకాలలో శిక్షణ, ఆధునిక చేనేత మగ్గాలను సమకూర్చడం, డై హౌస్ మరియు కామన్ ఫెసిలిటి సెంటర్ ఏర్పాటు చేస్తారు.
చేనేత పార్క్, గద్వాల:
రూ.14.98 కోట్లతో గద్వాలలో కొత్తగా హ్యాండ్ లూమ్ పార్క్ ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటికే స్థానిక నేత కార్మికులతో చర్చలు జరపడం జరిగింది, అంతేగాక సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) తయారీ ప్రక్రియ కొనసాగుతోంది.
గ్రూప్ వర్క్ షెడ్ మరియు అప్పరెల్ పార్క్:
మరమగ్గాల కార్మికులను యజమానులుగా మార్చేందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రిగారు గ్రూప్ వర్క్ షెడ్ (Worker to Owner) పథకానికి మరియు సిరిసిల్లలో అప్పరెల్ పార్క్ ఏర్పాటు కోసం శంఖుస్థాపన చేశారు. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వమే వర్క్ షెడ్లను ఉచితంగా నిర్మిస్తుంది. దీంతోపాటు 50% సబ్సిడీ, 30% బ్యాంకు లోను, 20% కార్మికుని వాటాతో ఒక్కో కార్మికునికి 8 లక్షల రూపాయల విలువైన (4) పవర్ లూమ్స్ ను అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) సిద్ధం అవుతుంది. దీంతో పాటు సాధారణ మరమగ్గాలను ఆధునీకరణలో భాగంగా రాష్ట్రంలోని మరమగ్గాలను ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెక్స్ చరింగ్, డైయింగ్, డిజైనింగ్, వార్ఫింగ్, వైండింగ్, సైజింగ్, క్యాలెండరింగ్ వంటి సౌకర్యాలతో కామన్ ఫెసిలిటి సెంటర్ ను ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఏర్పాటు చేస్తున్నాము. పై పథకాల కోసం ప్రభుత్వం 327 కోట్ల రూపాయలను కేటాయించింది.
వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్క్ :
వరంగల్ జిల్లాలో 1190 ఎకరాల విస్తీర్ణంలో Fibre-to-Fashion విధానంతో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ను ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు 22.10.2017 నాడు ఈ పార్క్ కోసం శంఖుస్థాపన చేశారు. దేశ, విదేశాలకు చెందిన 23 మంది పారిశ్రామికవేత్తలతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. ఫలితంగా 3900 కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు 60,000 నుంచి 80,000 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఈ పార్క్ ఏర్పాటుకోసం ప్రభుత్వం బడ్జెట్ లో 100 కోట్ల రూపాయలను కేటాయించింది. మౌలిక వసతుల కల్పన కోసం ఇప్పటికే 50 కోట్ల రూపాయలను విడుదల చేసింది.
రుణమాఫీ ప్రకటన:
మార్కెట్ లో తీవ్రమైన పోటీతో చేనేత ఉత్పత్తులకు సరైన ధర రావడం లేదు. ఫలితంగా నేత కార్మికుల ఆదాయ ప్రమాణాలు రోజురోజుకు దిగుజారుతున్నాయి. తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నారు. ఓ వైపు నేత కార్మికుల సామాజిక, ఆర్థిక బాగు కోసం ఎన్నో కార్యక్రమాలను ప్రవేశపెడుతున్న ప్రభుత్వం, అప్పుల ఊబి నుంచి వారిని బయటకు తెచ్చేందుకు రుణ మాఫీ కోసం 1280 కోట్ల రూపాయల కేటాయింపుల నుంచి ప్రత్యేకంగా 15 కోట్ల రూపాయలను ఇందుకోసం కేటాయించింది. చేనేత రంగం అభివృద్ధికి అవరోధంగా ఉన్న సమస్యల్లో వర్కింగ్ క్యాపిటల్ సౌకర్యం మెరుగ్గా లేకపోవడం, మార్కెటింగ్ సదుపాయాలు లేకపోవడం ప్రధానమైనవి. వీటి ఫలితంగానే వర్కింగ్ కాపిటల్ కోసం తీసుకున్న రుణాలను చేనేత కార్మికులు తిరిగి చెల్లించలేకపోతున్నారు. చేనేత కార్మికుల ఈ దుస్థితిని అర్థం చేసుకున్న ప్రభుత్వం, వ్యక్తిగత రుణ మాఫీ కూడా చేస్తోంది. ఫలితంగా వడ్డీ వ్యాపారుల, సూక్ష్మ రుణ సంస్థల నుంచి నేతన్నలకు విముక్తి కలగడంతో పాటు వారి జీవనోపాధి కూడా పెరుగుతుంది. దీంతో పాటు కొత్త రుణాలు తీసుకునే వెసులుబాటు కూడా కలుగుతుంది.
చేనేత కార్మికులు జాతీయ బ్యాంకుల నుంచి, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల నుంచి చేనేత ఉత్పత్తులకై 01.01.2014 నుంచి 31.03.2017 వరకు తీసుకున్న వర్కింగ్ కాపిటల్ వ్యక్తిగత రుణాలు లక్ష రూపాయల (లక్ష పైబడి తీసుకున్నా, ఒక లక్ష వరకు మాఫీ లభిస్తుంది)వరకు మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. SLBC ద్వారా బ్యాంకుల నుంచి తెప్పించిన వివరాల ప్రకారం సుమారు 2,467 మంది చేనేత కార్మికులు ఈ పథకంతో ప్రయోజనం పొంది రుణ విముక్తులు అవుతారు. ఇందుకోసం ప్రభుత్వం 10.10 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నది. ఈ 2,467 మంది చేనేత కార్మికుల్లో రుణాలు తిరిగి చెల్లించిన 205 మందికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా లబ్ది పొందిన నేతన్నలు, ఈ వృత్తిని కొనసాగించే క్రమంలో రుణం అవసరం అయితే మాఫీ అయిన దానికి తక్కువ కాకుండా తిరిగి పొందవచ్చు ఇప్పటిదాకా 1018 మరమగ్గాల వారికి కూడా ప్రభుత్వం రుణ మాఫీ చేసింది. ఇందుకోసం 5.65 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. మొత్తంగా 3,485 మంది చేనేత, మరమగ్గాల కార్మికుల కోసం 15.75 కోట్ల రూపాయల రుణాలను ఈ ప్రభుత్వం మాఫీ చేస్తుంది.