రాష్ట్రంలోని చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. చేనేతను ఆదుకునేందుకు రూ.1,270 కోట్లు కేటాయించామని కేటీఆర్ వెల్లడించారు. ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. చేనేత రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు చేయూతనిస్తుందని..నూలు, సిల్క్, డై, ఉన్ని రసాయనాల సబ్సిడీని 40 శాతానికి పెంచామని కేటీఆర్ తెలిపారు. సబ్సిడీ కోసం రూ.100 కోట్ల కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ యూనిఫాంలు, బతుకమ్మ చీరల కొనుగోలుకు రూ.240 కోట్లు కేటాయించామన్నారు.
గద్వాలలో హ్యాండ్లూమ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తం. చేనేతలను సమస్యల ఊబి నుంచి బయట పడేసేందుకు ప్రభుత్వం చర్యలుతీసుకుంటున్నదన్నారు. రాష్ట్రంలో 49,100 మరమగ్గాలున్నాయి. నేత కార్మికులకు రూ.8 లక్షల విలువైన నాలుగు యూనిట్లను అందజేస్తమన్నారు. మరమగ్గ కార్మికులను యజమానులుగా మార్చేందుకు వర్క్‌షెడ్ల నిర్మాణం చేస్తున్నట్లు చెప్పారు. వరంగల్ జిల్లాలో మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నం. మెగాటెక్స్‌టైల్ పార్క్ కోసం రూ.100 కోట్లు కేటాయించామని తెలిపారు. చేనేత కార్మికులకు వ్యక్తిగత రుణమాఫీ చేస్తున్నం. 1018 మంది మరమగ్గ కార్మికులకు ప్రభుత్వ రుణమాఫీ చేసినట్లు కేటీఆర్ వెల్లడించారు. మరమగ్గాల ఉత్పత్తులను టెస్కో కొనుగోలు చేస్తుందని చెప్పారు.