ఏపీలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర జోరుగా విజయవంతంగా కొనసాగుతోంది. పాదయత్రలో జనం నుండి స్పందనపై వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. అంతా అనుకున్న విధంగానే సాగుతుండడంతో పార్టీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నాయి. పాదయాత్రలో భాగంగా జగన్ దారిపొడవునా ప్రజలతో మమేకం అవుతూ, వారి సమస్యలు తెలుసుకుంటూ, అధికార పక్షంపై ఘాటు విమర్శలు చేసుకుంటూ, సీఎంపై సవాళ్లు విసురుతూ, ప్రజలపై వాగ్దానాల వర్షం కురిపిస్తూ జగన్ పాదయాత్ర సాగిపోతోంది.
ఇక జగన్ పాదయాత్రలో మూడో రోజు చోటు చేసుకున్న ఓ దృశ్యం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు అంతా దాని గురించే చర్చించుకుంటున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. మూడో రోజు పాదయాత్రలో జగన్ పక్కన ఓ అమ్మాయి ప్రత్యక్షం అయింది. బ్లాక్ టీ షర్ట్, జీన్స్ వేసుకుని, జగన్ సభలో, జగన్ పక్కనే నిలబడిన ఆ అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ ఎవరా అమ్మాయి.. జగన్ పక్కన ఏం పని.. అని అందరూ ఆరా తియ్యటం మొదలు పెట్టారు.
అయితే జగన్ ఏదైనా సభల్లో పాల్గొన్నప్పుడు.. సాధారణంగా స్థానిక వైసీపీ నాయకులు లేదంటే పార్టీలోని సీనియర్లు.. జగన్ పక్కన నిలబడతారు… లేకపోతే, మీడియాకు చెందిన నలుగురు కెమెరా మెన్లు జగన్ చుట్టూ నిలబడి వేరే వేరే యాంగిల్స్ లో కవర్ చేస్తూ ఉంటారు… అయితే, కొత్తగా ఈ అమ్మాయి నిలబడటంతో అందరూ ఆశ్చర్యపోయారు.. ఆ అమ్మాయి గురించి రకరకాలుగా ఊహించుకున్నారు. చివరకి ఆరా తీస్తే, ఆమె రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం మెంబర్ అని తేలింది.
ఇది ప్రశాంత్ కిషోర్ ఐడియా అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ తన ప్రసంగంలో ఏమన్నా మర్చిపోతే.. వెంటనే గుర్తు చేయడానికి తన బృందాన్ని పీకే ఇలా సెట్ చేశాడట. దాదాపు 50 మంది ప్రశాంత్ కిషోర్ టీం జగన్ తో పాటే ఉంటున్నారట. ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలనే విషయం.. వారే దగ్గరుండి చూసుకుంటున్నారని సమాచారం. అయితే దీనిపై విమర్శలు వస్తున్నాయి. బహిరంగంగా ఇలా కన్సల్టెంట్ లని తన పక్కన నిలబెట్టుకుని క్యాడర్‌కు జగన్ ఏలాంటి సంకేతాలు ఇవ్వాలనుకున్నారునే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఇక పాదయాత్ర ప్రారంభించినప్పటి నుండి జగన్ ఎలా దొరుకుతాడా.. బురదజల్లుదామని ప్రయత్నిస్తున్న పచ్చదళాణికి తనపై కామెంట్స్ చేసే అవకాశం ఇచ్చాడని సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జగన్ గెలిస్తే చారిత్రక విజయమా అని.. ఓడిపోతే పీకే లాంటి కన్సల్టెంట్ లను నియమించుకుని.. కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వకుండా జగన్ చారిత్రక తప్పిదం చేశారా అని కాలమే నిర్ణయిస్తోందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయ పడుతున్నారు.