ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నాలుగు రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి విదితమే .అయితే పాచంపల్లె పంచాయతీ కీర్తిరెడ్డిపల్లెకు చెందిన వృద్ధ దంపతులు ఓబుళయ్య, లక్ష్మమ్మకు వైఎస్ కుటుంబమంటే ఎనలేని అభిమానం. దీంతో వైసీపీ అధినేత ,ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర చేపడుతున్నారని తెలుసుకుని కీర్తిరెడ్డిపల్లె నుంచి మండుటెండలో ఇద్దరూ కలిసి 12 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ సంగాలపల్లె క్రాసింగ్ వరకు ఎదురొచ్చారు. జగన్‌ను కలిసే అవకాశం వారికి గంగిరెడ్డిపల్లె వద్ద దొరికింది. వారిని చూసి ఆప్యాయంగా పలకరించిన జగన్, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ వృద్ధ దంపతులు జగన్‌తో మాట్లాడుతూ.. ‘‘పెద్దాయన వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా నీవు రాజ్యమేలితే అప్పుడు మాలాంటి వారందరికీ మేలు జరుగుతుంది’’ అని చెప్పారు. దీనికి స్పందించిన జగన్ మీలాంటి వారి ఆశీస్సులు కావాలని ఆయన ఆప్యాయంగా అన్నారు.
