తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నిన్న పంటలకు కనీస మద్దతుధరపై సభ్యులు అడిగిన ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జవాబిస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభానాయకుడిగా చొరవ తీసుకొని మరింత స్పష్టత ఇచ్చారు. సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడం, నాణ్యమైన విద్యుత్ అందించడంతోపాటు రుణమాఫీ అమలువంటి అనేక విషయాల్లో విజయం సాధించామని, ఇప్పుడు రాష్ట్రంలో పంట కాలనీల ఏర్పాటు, పంటకు గిట్టుబాటు ధర కల్పించడంపై దృష్టి పెట్టామని చెప్పారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక్కోపంటకు ఎకరానికి రూ.4 వేల పెట్టుబడి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. దిక్కుతోచక కోడిగుడ్డుపై వెంట్రుకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మాకు అందుతున్న సమాచారం ప్రకారం.. కాంగ్రెస్‌వాళ్లే కొందరిని మేనేజి చేసి ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో డ్రామా క్రియేట్ చేశారు.
మళ్లీ ఇప్పుడు పంటలకు అగ్గిపుల్లలు గీసి, తగులబెట్టించి ఆ ఫొటోలు పేపర్లలో వచ్చేట్టు చేస్తున్నారు. ఇన్ని లక్షల ఎకరాల్లో సాగుచేస్తున్న క్రమంలో ఎక్కడో ఒకచోట కొంత పంటకు దోమపోటు రాదా..? కాంగ్రెస్.. దాన్ని ఒక ఇష్యూ చేయాలన్న చిలిపి రాజకీయ ప్రయత్నాలు తప్ప మరొకటి కాదు అని సీఎం కేసీఆర్ విమర్శించారు.