టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గరుడవేగ సంచలన విజయం సాధించడంతో.. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఇప్పుడు సినీ వర్గీయుల్లో హాట్ టాపిక్ అవుతున్నాడు. అతను డైరెక్ట్ చేయబోయే గోపీచంద్ బయోపిక్ మీద జనాల్లో ఇప్పటికే క్యూరియాసిటీ మొదలైంది. ఈ సినిమా మొదలు కావడాని కంటే ముందే దీని తర్వాత ప్రవీణ్ చేయబోయే సినిమా కన్ఫామ్ అయిపోవడం విశేషం.
ఇప్పటిదాకా స్టార్ ఇమేజ్.. మార్కెట్ రెండూ ఉన్న హీరోలెవ్వరితోనూ పని చేయని ప్రవీణ్ సత్తారు.. ఇప్పుడు ఆ అవకాశం అందుకున్నాడు. యువ కథానాయకుడు నితిన్‌తో తను సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని నితినే స్వయంగా వెల్లడించాడు. తమ సొంత సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో ప్రవీణ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు అతను ట్విట్టర్లో ప్రకటించాడు. గరుడవేగ రిలీజైన నాలుగు రోజులకే నితిన్ ఈ ప్రకటన చేయడాన్ని బట్టి ఈ సినిమాతో ప్రవీణ్ దశ ఎలా తిరగబోతోందో అర్థం చేసుకోవచ్చు. హాలీవుడ్ స్థాయిలో గరుడవేగ ను డీల్ చేయడం ద్వారా తాను స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు కూడా చేయగలనని ప్రవీణ్ రుజువు చేసుకున్నాడు.