తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించిందనే సంతోషకరమైన విషయాన్ని, సగర్వరంగా ఈ సభ ద్వారా ప్రజలకు తెలియచేస్తున్నాను. దేశంలో మరెక్కడా లేని విధంగా, చరిత్రలో మొదటి సారిగా రాష్ట్రంలోని దాదాపు 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు గతరాత్రి నుంచి ప్రయోగాత్మకంగా 24 గంటల కరెంటు సరఫరా జరుగుతున్నది. దశాబ్దాల పాటు కరెంటు కష్టాలు అనుభవించిన రైతాంగానికి ఇది తీపి కబురు. 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయడం ద్వారా ఉత్పన్నమయ్యే పరిస్థితిని ఐదారు రోజులపాటు అధ్యయనం చేసి, వచ్చే రబీ నుంచి శాశ్వత ప్రాతిపదికన నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయడానికి విద్యుత్ శాఖ తుది ఏర్పాట్లు చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో 25 శాతం విద్యుత్, వ్యవసాయ పంపుసెట్ల ద్వారానే వినియోగమవుతున్నది. రాష్ట్రం ఏర్పడిన కొద్ది రోజుల నుంచే అన్ని పంపుసెట్లకు 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతున్నది.
గత జూలై నెల నుంచి పాత మెదక్, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా అందుబాటులోకి వచ్చింది. వచ్చే రబీ నుంచి రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల పాటు నిరంతరాయ కరెంటు సరఫరా చేయడానికి విద్యుత్ శాఖ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. అందుకు కావాల్సిన విద్యుత్ ను కూడా సమకూర్చుకుంటున్నది. ఇటీవల రాష్ట్రంలో 9,500 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఏర్పడినా ఎక్కడా రెప్పపాటు కూడా కోత విధించకుండా రికార్డు స్థాయిలో 198 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేయడం జరిగింది. వచ్చే రబీ సీజన్ లో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వడం వల్ల ఏర్పడే, 11,000 మెగావాట్ల డిమాండ్ మేరకు సరఫరా చేయడానికి విద్యుత్ సంస్థలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను.
వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజున తీవ్రమైన విద్యుత్ సంక్షోభం నెలకొని ఉంది. నిత్యం కరెంటు కోతలతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారు. హైదరాబాద్ నగరంలో రోజూ రెండు నుంచి నాలుగు గంటలు, ఇతర నగరాలు – పట్టణాల్లో ఆరు గంటలు, గ్రామాల్లో 9 గంటలు అధికారిక విద్యుత్ కోతలు అమలయ్యేవి. పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడేలుండేవి. కావాల్సినంత కరెంటు లేకపోవడంతో పరిశ్రమలు పెద్ద ఎత్తున మూతపడ్డాయి. కరెంటు కోసం ఫిక్కి, సిఐఐ ఆధ్వర్యంలో పారిశ్రామిక వేత్తలు నిత్యం ధర్నాలు చేసేవారు. అటు ఇందిరా పార్కు, ఇటు విద్యుత్ సౌధలో ఎప్పుడూ ఆందోళనలే కొనసాగేవి. హైదరాబాద్ లో పరిశ్రమలు పెట్టాలంటేనే భయపడే వాతావరణం ఉండేది. వ్యవసాయానికి రెండు మూడు గంటల కరెంటు కూడా అందకపోవడంతో పంటలు ఎండిపోయేవి. భూగర్భంలో నీళ్లున్నా తోడుకునేందుకు కరెంటు లేక చేతికొచ్చిన పంట కళ్లెదుటే ఎండిపోతున్నా రైతాంగం ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడేది.
అపారమైన పంట నష్టం రైతులను ఆర్థికంగా కృంగదీసేది.తెలంగాణ ఏర్పడిన నాడు రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం6,574 మెగావాట్లు. ఇందులో నికరంగా విద్యుత్ అందే థర్మల్ పవర్ ప్లాంట్ల సామర్థ్యం 4,300 మెగావాట్లు. జల విద్యుత్ 2,081 మెగావాట్లు. నాడు తెలంగాణ రాష్ట్రానికి 2,700 మెగావాట్ల వరకు విద్యుత్ లోటు ఉండేది. డిమాండ్ కు సరిపడినంత సరఫరా జరగలేదు. గత పాలకులు అవలంభించిన నిర్లక్ష్య వైఖరి వల్ల, ప్రణాళికా లోపం వల్ల అన్ని రంగాల్లో గాఢాంధకారం అలుముకుంది. విద్యుత్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. అలాంటి పరిస్థితి నుంచి నేడు… నేనిక్కడ… ఈ సభలో ఈ ప్రకటన చదువుతున్న నిమిషానికి తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతున్నదని సగర్వంగా, సంతోషంగా ప్రకటిస్తున్నాను.
చిమ్మ చీకట్లు అలుముకున్న దుస్థితి నుంచి ఇవాళ వెలుగు జిలుగుల తెలంగాణ ఆవిష్కరించడానికి ఎంతో కృషి జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే, విద్యుత్ సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు రచించి, అమలు చేసింది. దాదాపు 94వేల కోట్ల రూపాయల వ్యయంతో తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగా నత్తనడకన నడుస్తున్న ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రభుత్వం పరుగులు పెట్టించింది. కొత్త ప్లాంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పంపిణీ, సరఫరా వ్యవస్థలను పటిష్టం చేసింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 6,574 మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉంటే, గడిచిన మూడున్నర సంవత్సరాల వ్యవధిలోనే అదనంగా మరో 7,981 మెగావాట్ల విద్యుత్ ను సమకూర్చుకోగలిగింది. సింగరేణి పవర్ ప్లాంటు ద్వారా 1200 మెగావాట్లు, కెటిపిపి ద్వారా 600 మెగావాట్లు, జారాల ద్వారా 240 మెగావాట్లు, పులిచింతల ద్వారా 90 మెగావాట్లు, చత్తీస్ గఢ్ నుంచి 1000 మెగావాట్లు, సిజిఎస్ తదితర మార్గాల ద్వారా మరో 2000 మెగావాట్లు అదనంగా సమకూర్చుకోవడం జరిగింది. గ్రీన్ పవర్ ఉత్పత్తి గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో కొత్త సోలార్ పాలసీని తీసుకురావడం జరిగింది. దీని ఫలితంగా తెలంగాణ రాష్ట్రం 2,792 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తితో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని సగర్వంగా ప్రకటిస్తున్నాను. వీటన్నింటి ఫలితంగా నేడు తెలంగాణ రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 14,555 మెగావాట్లు. మరో 13,752 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం కొత్త ప్లాంట్ల నిర్మాణం జరుగుతున్నది.
వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరాతో పాటు, కొత్తగా నిర్మించే ఎత్తిపోతల పథకాలకు 8,500 మెగావాట్లు అవసరమవుతుంది. కొత్తగా నెలకొల్పే పరిశ్రమలతో పాటు ఇతరత్రా పెరిగే డిమాండ్ కోసం విద్యుత్ ను సమకూర్చుకోవడం కోసం ఈ కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం జరుగుతున్నది. 4వేల మెగావాట్ల సామర్థ్యంతో యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంటు నిర్మాణం జరుగుతున్నది. మణుగూరు, కొత్తగూడెం ప్రాంతాల్లో నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ల ద్వారా 1,880 మెగావాట్ల విద్యుత్ వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తుంది. ఎన్.టి.పి.సి. ఆధ్వర్యంలో 1600 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు నిర్మాణంలో ఉంది. 28వేల మెగావాట్లకు పైగా స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకొల్పి తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. పూర్థి స్థాయి పారదర్శకత సాధించడం కోసం, జాప్యాన్ని నివారించడం కోసం విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాలను ప్రభుత్వ రంగ సంస్థ అయిన బి.హెచ్.ఇ.ఎల్. కు అప్పగించడం జరిగింది.
12,136 కోట్ల రూపాయల వ్యయంతో పంపిణీ, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 400 కెవి సబ్ స్టేషన్లు ఆరు ఉంటే, కొత్తగా మరో ఐదు నిర్మించి, వాటి సంఖ్యను 11కు చేర్చాము. 400 కెవి సబ్ స్టేషన్లు మరో 5 నిర్మించడానికి ప్రణాళిక రచించడం జరిగింది. 220 కెవి సబ్ స్టేషన్లు 51 ఉంటే, కొత్తగా మరో 19 నిర్మించి, వాటి సంఖ్యను 70కి పెంచడం జరిగింది. 132 కెవి సబ్ స్టేషన్లు 176 ఉంటే, కొత్తగా 35 నిర్మించి, వాటి సంఖ్యను 211 కు పెంచడం జరిగింది. 33 కెవి సబ్ స్టేషన్లు 2,181 ఉంటే, కొత్తగా 515 నిర్మించి, వాటి సంఖ్యను 2,696కి పెంచడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి అన్ని రకాల సబ్ స్టేషన్లు కలిపి 2,414ఉండగా, 574సబ్ స్టేషన్లను కొత్తగా నిర్మించి, నేడు 2,988 సబ్ స్టేషన్లను అందుబాటులోకి తేవడం జరిగింది.
రాబోయే మూడు నాలుగేళ్లలో పంపిణీ, సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేయడానికి 42 వేల కోట్ల పెట్టుబడితో కొత్తగా పద్దెనిమిది 400 కెవి సబ్ సబ్ స్టేషన్లు, ముప్పయి నాలుగు 220 కెవి సబ్ స్టేషన్లు, తొంభై 132 కెవి సబ్ స్టేషన్లు, తొమ్మిది వందల ముప్పయి ఏడు 33/11 కెవి సబ్ స్టేషన్లు నిర్మించడానికి ప్రణాళిక రూపొందించబడింది.నాడు 400 కెవి లైన్లు 1682 కిలోమీటర్లుంటే, కొత్తగా 1,012 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయడం జరిగింది. 220 కెవి లైన్లు నాడు 5,559 కిలోమీటర్లు ఉంటే, కొత్తగా 1,340 కిలోమీటర్ల లైను వేయడం జరిగింది. 132 కెవి లైన్లు నాడు 9,136 కిలోమీటర్లుంటే, కొత్తగా 1,184 కిలోమీటర్లు వేయడం జరిగింది. మొత్తం హైటెన్షన్ లైన్లు నాడు 16,378 కిలోమీటర్లుంటే, తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్తగా 3,537 కిలోమీటర్లు కొత్తగా వేయడం జరిగింది. నేడు తెలంగాణ రాష్ట్రంలో 19,916 కిలోమీటర్ల మేరు హైటెన్షన్ విద్యుత్ లైన్లు ఉన్నాయి.
డిస్ట్రిబ్యూషన్ల లైన్లు కూడా భారీ స్థాయిలో పెంచడం జరిగింది. 33 కెవి లైన్లు నాడు 17,760 కిలోమీటర్లుంటే, అదనంగా 4,180 కిలోమీటర్లు వేయడం జరిగింది. 11 కెవి లైన్లు నాడు 1,20,834 కిలోమీటర్లుంటే, కొత్తగా 25,551 కిలోమీటర్లు వేయడం జరిగింది. ఎల్.టి. లైన్లు నాడు 2,94,374 కిలోమీటర్లుంటే, కొత్తగా 21,302 కిలోమీటర్లు వేయడం జరిగింది. మొత్తం డిస్ట్రిబ్యూటరీ లైన్లు నాడు 4,32,968 కిలోమీటర్లుంటే, కొత్తగా 51,033 కిలోమీటర్లు జతచేయడం ద్వారా నేడు తెలంగాణలో 4,84,001 కిలోమీటర్ల లైన్లు అందుబాటులోకి వచ్చాయి.
పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా సరఫరా వ్యవస్థను తీర్చిదిద్దడం కోసం హైటెన్షన్ సరఫరా సామర్థ్యాన్ని 12,653 మెగావాట్ల నుంచి 20,660 మెగావాట్లకు పెంచడం జరిగింది.తెలంగాణ రాష్ట్రం చూపించిన చొరవ కారణంగా ఉత్తర, దక్షిణ గ్రిడ్ ల మధ్య కొత్త విద్యుత్ లైన్ల నిర్మాణం కూడా జరిగింది. వార్దా-మహేశ్వరం వయా డిచ్ పల్లిల మధ్య 765 డబుల్ సర్క్యూట్ లైన్ నిర్మాణం పూర్తయింది. వరంగల్-వరోరా లైను మరో మూడేళ్లలో నిర్మాణం పూర్తవుతుంది.
ఈ లైన్ల ద్వారా తెలంగాణ రాష్ట్రం 2,000 మెగావాట్ల విద్యుత్ పొందడానికి వీలుగా పిజిసిఐఎల్ తో ఒప్పందం చేసుకుంది. ఈ లైన్ల ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా కావాల్సినంత విద్యుత్ పొందే వెసులుబాటు తెలంగాణ రాష్ట్రానికి కలిగింది.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో నిరంతర విద్యుత్ సరఫరా జరగడానికి వీలుగా జిహెచ్ఎంసి చుట్టూ 142 కిలోమీటర్ల మేర 400 కెవి రింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లైన్లను అనుసంధానం చేయడం కోసం 220 కెవి సబ్ స్టేషన్లు ఆరింటిని నిర్మించడం జరిగింది.తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల ఆర్థిక క్రమశిక్షణకు, మెరుగైన పనితీరుకు ప్రశంసాపూర్వకంగా ఆర్.ఇ.సి., పి.ఎఫ్.సి. లాంటి ఆర్థిక సంస్థలు ఇచ్చే రుణంపై వడ్డీని 12 శాతం నుంచి 9.95 శాతానికి తగ్గించాయి. దీనివల్ల ప్రతీ ఏటా విద్యుత్ సంస్థలకు 200 కోట్ల మేర వడ్డీ భారం తగ్గుతున్నది.డిస్కమ్ లపై ఆర్థిక భారం తొలగించడానికి తెలంగాణ రాష్ట్రం ఉదయ్ పథకంలో చేరింది. డిస్కమ్ లకున్న 8,923 కోట్ల రుణభారాన్ని ప్రభుత్వం భరిస్తున్నది.
దీని ద్వారా డిస్కమ్ లు రుణవిముక్తి పొంది, మరింత స్వేచ్ఛగా తమ కార్యకలాపాలు నిర్వహించడం సాధ్యమవుతుంది. ఆర్థిక ప్రగతికి సూచికగా చెప్పబడే తలసరి విద్యుత్ వినియోగంలో కూడా తెలంగాణ రాష్ట్రం జాతీయ సగటును మించింది. తెలంగాణ ఏర్పడే నాటికి తలసరి విద్యుత్ వినియోగం ఏడాదికి 1,200 యూనిట్లుగా ఉంటే, ఇప్పుడు తలసరి విద్యుత్ వినియోగం 1,505 యూనిట్లకు పెరిగింది. మూడున్నరేళ్లలో తెలంగాణలో విద్యుత్ వినియోగం 26 శాతం పెరిగింది. 2016-17 సంవత్సరంలో జాతీయ సగటు 1,122 యూనిట్లయితే, తెలంగాణ సగటు అంతకన్నా 383 యూనిట్లు అదనంగా నమోదైంది. ఈ పెరుగుదల తెలంగాణ రాష్ట్ర పురోగతికి, రాష్ట్ర ప్రజల మెరుగైన జీవన విధానానికి అద్దం పడుతున్నది.విద్యుత్ సంస్థలు బలోపేతమైతే, ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ ఉత్పత్తి జరిగితే రాష్ట్రంలోని పేదలకు మరిన్ని సబ్సిడీలు అందించవచ్చని ప్రభుత్వం మొదటి నుంచి భావిస్తున్నది.
అందుకనుగుణంగానే నేడు వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు, పేదలకు సబ్సిడీలు అందించగలుగుతున్నాం. ప్రభుత్వం పేదలకు విద్యుత్ సబ్సిడీలు అందించడం కోసం బడ్జెట్లో 4,777 కోట్ల రూపాయలు కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను.వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందిస్తున్న శుభ తరుణంలో రైతులకు వినమ్రపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఆటో స్టార్టర్లను తొలగించుకోవాలని కోరుతున్నాను. కేవలం విద్యుత్ ఆదా చేయడం కోసం ఆటో స్టార్టర్లను తొలగించాలని కోరడం లేదు. భూగర్భ జలాలను కాపాడడం కోసం కూడా ఆటోస్టార్టర్ల తొలగింపు తప్పని సరి అని విన్నవించుకుంటున్నాను.
విద్యుత్ సంస్థలను సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. విద్యుత్ సంస్థలలో పనిచేసే 22,550 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్టు వ్యవస్థ నుంచి తప్పించి నేరుగా జీతాలు చెల్లిస్తున్నది. విద్యుత్ సంస్థల్లో కొత్తగా 13,357 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది.విద్యుత్ సంస్థల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అంకితభావంతో కష్టపడి పనిచేసి మెరుగైన పరిస్థితి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులందరికీ అభినందనలు తెలుపుతున్నాము. చిత్తశుద్దితో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం అండదండగా ఉంటుందని ప్రకటిస్తున్నాను.తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ ను అవసరమున్నంత మేరకు సరఫరా చేయడానికి ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తుందని మరోసారి ప్రకటిస్తున్నాను అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు .