ఎన్నో పోరాటాలు ..ఎంతో మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల అరవై ఏండ్ల కలను సాకారం చేసిన ఇంటి పార్టీ ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్ బంపర్ మెజారిటీతో అధికారాన్ని చేపట్టింది .దీంతో గత మూడున్నర ఏండ్లుగా అధికార టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తూ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ నిర్మాణం వైపు నడిపిస్తుంది .అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నార్తులు, అనాథలకు అండగా ఉంటూ అన్నీ తానై సర్కారు తగు చర్యలను తీసుకుంటుంది .అరవై యేండ్ల సమైక్య పాలనలో పాలకులు ఎన్నడు ఆలోచించని రీతిలో అద్భుతమైన పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్ అన్నివర్గాల ఆంక్షాలను నెరవేరుస్తూ బంగారు తెలంగాణకు కృషిచేస్తున్నారు.
ఈ క్రమంలో తన తండ్రి సీఎం కేసీఆర్‌కు తగ్గ తనయ అనిపించుకుంటూ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తనదైన శైలిలో ప్రజలపై ప్రత్యేక ముద్రను వేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే మన ఊరు- మన ఎంపీ కార్యక్రమంతో జనాలతో మమేకమయ్యారు. పల్లె ప్రజల సాధక బాధకాలను తెలుసుకొని తీరుస్తూ పెద్ద దిక్కుగా మారారు. తాజాగా ఎంపీ కవిత మరో నిర్ణయం తీసుకున్నారు. వైద్యంకోసం జిల్లాకేంద్రంలోని పెద్ద దవాఖానకు వచ్చే రోగి వెంట ఉండే వారందరికీ అండగా నిలవాలని నిర్ణయించారు. రోగుల వెంట వచ్చే వారందరికీ ఆకలి తీర్చేందుకు ఎంపీ కవిత అమ్మలా ముందుకొచ్చారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత అనేక మార్లు జిల్లా కేంద్ర దవాఖానను ఆమె సందర్శించారు. అక్కడ రోగుల కష్టాలను కళ్లారా చూసి చలించారు. వెంటనే మెరుగైన వైద్యం కోసం ఆదేశించారు. జిల్లా కేంద్ర దవాఖానను ఒక మోడల్‌గా తీర్చిదిద్దారు. అయితే ఇది అంత ఒక ఎత్తు అయితే మరోవైపు ఆమెలో ఉన్న అమ్మ కోణం మరోవైపు.
జిల్లా నలుమూలల నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి, సుదూర తండాల నుంచి వైద్యం కోసం ఎంతోమంది జిల్లా దవాఖానకు వస్తుంటారు. దూర భారమైన వేళ రోగి వెంబడి ఒకరే వచ్చిన సందర్భాలు కోకొల్లలు. దవాఖానలో రోగులకు భోజన వసతి ఉన్నప్పటికీ.. రోగి తరపు వచ్చే వారికి ఆ సౌకర్యం లేదు. ఆకలి కాగానే ఆ పేషంట్‌ను వదిలి దవాఖానకు దూరంగా తక్కువ రేట్‌కు ఏ హోటళ్లలో భోజనం దొరుకుతుందో అన్వేషిస్తూ ఆకలి తీర్చుకుంటుంటారు. వారు తిని వచ్చే వరకు దవాఖానలో ఆ రోగి ఒంటరిగా ఉండాల్సిందే. దవాఖానలో ఉన్నన్ని రోజులు ఇదే పరిస్థితి. ఆకలి వ్యధలు, కడుపు నిండా తిండి, నిద్ర కరువైన పరిస్థితులు. ఈ దైన్యమైన జీవితాలను ఎంపీ కవిత దగ్గరగా చూశారు.అప్పుడే ఒక స్థిర నిశ్చయానికి వచ్చారు. రోగులకే కాదు, రోగుల వెంట దవాఖానకు వచ్చే వారికి ఉచితంగా భోజనం అందించాలని నిర్ణయించారు. జిల్లా కేంద్ర దవాఖానలో ఈ రోజు బుధవారం నుంచి ఇక నిరంతరాయంగా ఉచిత భోజన వసతిని కల్పించనున్నారు. ఈ ఆలోచన గతంలో ఎవరికీ రాలేదు. జిల్లా కేంద్ర దవాఖానలోని సఖీ భవనంలో బుధవారం మధ్యాహ్నం 12గంటలకు నిత్యాన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుడతారు.