ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయత్రలో జనంపై హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచితంగా విద్యుత్, అర్హులైన పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామన్నారు. ఖాళీగా ఉన్న లక్షా 42వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు చేయని అక్రమాలు, అరాచకాలు లేవని జగన్ ధ్వజమెత్తారు. వైసీపీ అధినేత జగన్ రెండో రోజు ప్రజాసంకల్పయాత్రలో ఓ వైపు హామీల వర్షం.. మరోవైపు చంద్రబాబుపై నిప్పుల వర్షం కురిపించారు.
పాదయాత్రలో రెండో రోజు జగన్ నుండి ఒక సంచలన మాట ఒకటి బయటకి వచ్చింది. జగన్ మాట్లాడుతూ వృద్దాప్య పెన్షన్లు అవసరమైతే మూడువేల రూపాయలు చేస్తామని ప్రకటించారు. వృద్ధులకు 2 వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు. అవ్వలకు, తాతలకు ప్రస్తుతం రూ.1000 ఉన్న పెన్షన్.. మేము అధికారంలోకి రాగానే రూ.2 వేలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక మమ్మల్ని చూచి చంద్రబాబు వృద్ధులకు 2 వేల పెన్షన్ ఇస్తానంటే.. మేము 3 వేలు చేస్తామని.. అంతేకాకుండా అనాథలుగా ఉంటుంన్న వృద్ధుల కోసం ప్రతి మండలంలో ఓ వృద్దాశ్రమం ఏర్పాటు చేస్తామని.. వృద్ధులను అన్ని రకాలుగా ఆదుకుంటామని.. కన్న తల్లిదండ్రులని పట్టించుకోని వాడు ఒక మంచి కొడుకు కాలేడని.. అంతకన్నా ముఖ్యంగా నాయకుడు కాలేడని జగన్ నోటి నుండి సంచలన మాటలు జాలువారడంతో రాజకీయవర్గాల్లో గుసగుసలు మొదలు అయ్యాయని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.