టాలీవుడ్‌లో టాప్ కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగిన సునీల్.. ఆ తర్వాత హీరోగా టర్న్ అయిన సంగతి తెలిసిందే. మొదట్లో సునీల్ హీరోగా తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపించినా.. ఆతర్వత చిత్రాలు వరుసగా బోల్తా కొట్టాయి. దీంతో మరోసారి కమెడియన్ అవతారం ఎత్తబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే అసలు విషయం ఏంటంటే.. హీరోగా హిట్స్ కోసం మొహం వాచిపోయి ఉన్న హీరో సునీల్ తో ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణ ప్రసాద్ తమిళ్ సినిమా ఒకటి రీమేక్ చేయాలనుకున్నారు. ఇందు కోసం సునీల్ కి ఇప్పటికే అడ్వాన్స్ కూడా ఇచ్చేసారు. కానీ ఇప్పుడు శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసాడని తెలుస్తుంది.
అయితే కృష్ణ ప్రసాద్.. సునీల్ సినిమాని పక్కనపడేసి ఇప్పుడు ఇంకో సినిమా స్టార్ట్ చేస్తున్నారు. ఇంద్రగంటి మోహన్ డైరక్షన్‌లో సుధీర్ బాబు హీరోగా నటించే సినిమా త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు. మరి సునీల్ సినిమాని పక్కనబెట్టడానికి గల కారణాలు ఏంటని ఆరా తీస్తే.. సునీల్ బాగా లావుగా వున్నాడని.. ఈ సినిమాకి లావు ఉంటే పనికి రాడని.. అందుకే ఈ సినిమాను పక్కన పెట్టేసాడు అని టాక్. ఈ సినిమా స్టార్ట్ అవ్వకపోటానికి వేరే కారణాలు కూడా వున్నాయి అని తెలుస్తోంది.
సునీల్ తో మొదలెట్టబోయే సినిమాకు సంభాషణల రచయిత దగ్గర హీరో, నిర్మాత ఓ మాట మీదకు రాలేకపోయారని తెలుస్తోంది. మొదట ఈ సినిమాకు సంభాషణలు రాసేందుకు రచయిత కృష్ణ భగవాన్ అయితే బాగుంటారని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ నిర్మాత వేరే వాళ్ల చేత స్క్రిప్ట్ రాయించారని… దానికి తోడు తమిళ సినిమా జిరాక్స్ కాపీ తీయాలని నిర్మాత అనుకున్నట్లు తెలుస్తోంది. ఇలా అభిప్రాయాలు కుదరక సునీల్ హీరోగా అనుకున్న ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేసారని సినీ వర్గీయుల్లో చర్చించుకుంటున్నారు.