వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర టీడీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. జగన్ పాదయాత్ర అలా ప్రారంభమైందో.. లేదో.. ఇంతలో జగన్‌పై టీడీపీ నేతల విష ప్రచారం జోరందుకుంది. ప్రజా సంకల్ప యాత్రపై ఎదురుదాడి చేయాలని చంద్రబాబు ఆదేశించడంతో టీడీపీ నేతలు హడావుడి చేసేందుకు సిద్ధమయ్యారు.
ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్రను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. జగన్ పాదయాత్ర మొదలుపెట్టి రెండు రోజులు కాకముందే అట్టర్ ప్లాప్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్ర విజవంతమైతే రాజకీయంగా ఇబ్బందులు తప్పవని గ్రహించిన టీడీపీ నేతలు పనిగట్టుకుని విషం చిమ్ముతున్నారు. జగన్ పాదయాత్రపై టీడీపీ అసెంబ్లీ స్ర్టాటజీ కమిటీ సమావేశంలో పాదయాత్రపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు సమాచారం.
పాదయాత్రపై ఎటువంటి వ్యూహాలు అనుసరించాలన్నదానిపై పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు మాట్లాడినట్లు తెలుస్తోంది. పాదయాత్రపై పార్టీ నేతలంతా ఎదురుదాడి చేయాలని చంద్రబాబు ఆదేశించినట్లుగా ప్రచారం జరుగుతోంది. వర్షాన్ని సైతం లేక్క చేయక పెద్ద సంఖ్యలో ప్రజలు పాదయాత్రకు హాజరయ్యారు. తమ కష్టాలను జగన్‌మోహన్‌రెడ్డితో చెప్పుకుని.. తమ బాధను ఆయనతో పంచుకున్నారు. చంద్రబాబు చేస్తున్న మోసాన్ని అన్ని వర్గాల ప్రజలు జగన్‌కు వివరించారు. కొన్ని గ్రామాల్లో మహిళలు తమ కష్టాలను తెలుసుకునేందుకు వచ్చిన జగన్‌కు మంగళహారతులు పట్టి ఘన స్వాగతం పలికారు.
జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం మిన్నంటింది. త్వరలో జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని, జగన్ పాదయాత్ర ఆధ్యంతం విజయవంతంగా కొనసాగాలని ప్రార్ధనలు, పూజలు చేస్తున్నారు.
ఈ క్రమంలో, ప్రభుత్వానికి ధైర్యం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికల బరిలోకి దిగాలని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు చంద్రబాబుకు సవాల్ విసిరారు. రంపచోడవరం ఎమ్మెల్యే టీడీపీలో చేరినంత మాత్రాన గిరిజనులంతా తమతోనే ఉన్నారని ప్రభుత్వం భావించడం అవివేకమన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి తేల్చుకోవాలని హితవు పలికారు. అన్ని ఏజెన్సీ, డివిజన్ ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్‌సీపీ గెలవబోతుంది. కేవలం ఫిరాయింపులను ప్రోత్సహించడం కాదు.. మీకు దమ్ము.. ధైర్యం ఉంటే అందరితోటి రాజీనామా చేయించు.. ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం అని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారని, మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నామన్నారు కన్నబాబు.
కాగా, వైసీపీ నుంచి తెదేపాలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే వంతల రాజేవ్వరిపై చర్యలు తీసుకోవాలంటూ వైఎస్ఆర్‌సీపీ నేతలు స్పీకర్‌ను ఈ రోజు కోరనున్నారు. గతంలో ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కూడా ఇచ్చిన ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు స్పీకర్‌ను కోరనున్నట్లు సమాచారం.