ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న వైద్య రంగాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని.. విమర్శలు చేయడం సరికాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు .శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సీఎం మాట్లాడుతూ… గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల భయంకరమైన స్థితిలో కూరుకుపోయిన వైద్యారోగ్య శాఖకు జీవం పోశామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇటీవలే ఓ పత్రికలో ఒక వార్త చూసినట్లు సీఎం చెప్పారు. ఓ ఆస్పత్రిలో బెడ్లు లేవు.. కిటికీకి స్లైన్ బాటిల్ కట్టి చికిత్స అందిస్తున్నట్లు ఆ పత్రిక యాజమాన్యం ప్రచురించింది. దీనిపై తాను వైద్యారోగ్య శాఖ మంత్రి వివరణ, ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడిన తర్వాత అసలు విషయం తెలిసిందన్నారు. ప్రతీ ఆస్పత్రిలో నిర్ణీత పడకలు ఉంటాయి. పడకలకు మించి రోగులు రావడం వల్ల.. అందరికీ వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే వైద్యులు మానవతా దృక్పథంతో వైద్యం చేస్తుంటే అలాంటి కథనాలు ప్రచురించడం సరికాదన్నారు. ఆ తర్వాత సదరు పత్రిక యాజమాన్యానికి ఫోన్ చేసి.. అసలు విషయం తెలుసుకోకుండా ఇలాంటి వార్తలు రాయొద్దు.. వైద్యులను ప్రోత్సాహించాల్సింది పోయి.. విమర్శనాత్మక కథనాలు ప్రచురించొద్దని సూచించినట్లు సీఎం తెలిపారు. కేసీఆర్ కిట్ పథకం అమలు తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య పెరిగిందన్నారు. అయినప్పటికీ వైద్యులు చిత్తశుద్ధితో వైద్యం అందిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యరంగంలోని డాక్టర్లను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని సీఎం పేర్కొన్నారు.