ప్రాణాంతకమైన క్యాన్సర్‌ను జయించి తిరిగి తనకిష్టమైన క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన యువరాజ్ సింగ్ పోరాట పటిమ అందరికీ తెలిసిందే. తాను క్యాన్సర్‌ను జయించిన తీరు, తన తల్లిదండ్రులు పడిన వేదన, తాను కోలుకోవాలని అభిమానులు కోరుకోవడాన్ని యువరాజ్ ఎప్పుడూ ప్రస్తావిస్తూనే ఉంటాడు. అప్పుడప్పుడు భావోద్వేగాన్ని ఆపుకోలేక కంటతడి కూడా పెడుతుంటాడు. తాజాగా మరోసారి ఆ బాధాకర సంఘటనను తలుచుకొని యువరాజ్ కంటతడి పెట్టుకున్నాడు. దీనికి బిగ్ బి అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి (కేబీసీ)’ వేదికైంది.
కేబీసీ 9వ సీజన్ గ్రాండ్ ఫినాలేలో యువరాజ్ సింగ్, బాలీవుడ్ నటి విద్యాబాలన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హాట్ సీట్లలో కూర్చొని తమ అనుభవాలను అమితాబ్‌తో పంచుకున్నారు. బిగ్‌బి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో తాను క్యాన్సర్ బారిన పడిన తీరును వివరించిన యువరాజ్ ఒకింత భావోద్వేగానికి గురయ్యాడు. కంటతడి పెట్టుకోవడంతో పక్కన ఉన్న విద్యాబాలన్ భుజంపై చేయివేసి ఓదార్చింది. ఈ సన్నివేశంతో కూడిన ప్రోమోను కూడా సోనీ ఛానల్ తమ ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.
‘ఓ రోజు రాత్రి మధ్యలో నిద్ర లేచాను. శరీరంపై నాకు ఎర్రటి జిగురు కనిపించింది. డాక్టర్లు పరిశీలించి దాన్ని 14 సెం.మీ. ట్యూమర్‌గా తేల్చారు. కానీ నేను అదేమీ పట్టించుకోకుండా క్రికెట్ ఆడాను. ఇది నా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించింది. వెంటనే చికిత్స ప్రారంభించకపోతే ప్రాణానికే ప్రమాదమని మా డాక్టర్ చెప్పేశారు. వెంటనే అమెరికా వెళ్లి కీమోథెరపీ చేయించుకున్నాను. ఒక క్రీడాకారుడిగా నేను దీన్ని నమ్మలేకపోయాను. రోజుకి 6 నుంచి 8 గంటల పాటు క్రికెట్ ఆడే నాకు క్యాన్సర్ అంటే ఎలా నమ్మగలను’ అని యువీ భావోద్వేగానికి గురయ్యాడు.