విజయనగరం జిల్లా బెలగాం పట్టణంలోని సౌందర్య థియేటర్‌లో ఓ మహిళపై అక్కడ పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుడు అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు ప్రశ్నించిన ఆమె భర్తపై తోటి సిబ్బంది దాడి చేసి గాయపరిచారు. మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలివి.. సీతానగరం మండలం చినభోగిలికి చెందిన తోట చైతన్య తన భార్య, కుటుంబ సభ్యులతో ఉన్నది ఒక్కటే జిందగీ ఉదయం ఆటకు తీసుకెళ్లారు. సినిమా మధ్యలో ఆమె టాయిలెట్‌కు వెళ్లారు.
అప్పటికే అందులో శుభ్రం చేయడానికి ఉన్న పారిశుద్ధ్య కార్మికుడు ఆమె చెయ్యి పట్టుకుని లాగాడు. దీంతో ఆమె బయటకు పరుగు తీసి భర్తకు విషయాన్ని తెలిపింది. వెంటనే చైతన్య వచ్చి కార్మికుడిని నిలదీయగా తోటి కార్మికులు, సినిమా థియేటర్ సిబ్బంది చైతన్యపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.