బడుగు బలహీనవర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ క్రమంలో మరో ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. విజన్ 2024 పేరుతో ఈ కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఇందులో భాగంగా మంగళవారం మాసబ్ ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో జరిగిన తెలంగాణ బీసీ విజన్- 2024 మొదటి దశాబ్ద డాక్యుమెంట్ రూపకల్పన కోసం బీసీ వర్గాల మేధావులు, వివిధ సంఘాల ప్రముఖులు, ఉన్నతాధికారులతో మంత్రి జోగు రామన్న ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ బీసీ విజన్ – 2024 కోసం పలువురు సలహాలు, సూచనలు చేశారు. ఈ సమావేశంలో వచ్చిన ఫీడ్ బ్యాక్‌ను విశ్లేషించి సమగ్ర బీసీ విజన్ 2024ను రూపొందించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదికను అందజేయనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి జోగు రామన్న మాట్లాడుతూబీసీల పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పక్కా విజన్ ఉందని, అందులో భాగంగానే బీసీ సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ బీసీ విజన్-2024 కోసం ఆదేశించారని మంత్రి జోగు రామన్న వివరించారు. రానున్నఅసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోగా తెలంగాణ బీసీ విజన్ 2024 ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు అన్నారు. బీసీల సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బీసీల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. 2014-24 దశాబ్ద కాలంలో బీసీ వర్గాల కోసం అమలు చేస్తున్న, చేయాల్సిన కార్యాచరణ ప్రణాళికను మరింత పకడ్బందీగా రూపొందించాలని.. తద్వారా బీసీ వర్గాల కోసం ఇంకా ఏం చేస్తే బాగుంటుందోనన్న విషయం తెలుస్తుందన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేశామని, ముస్లీంలకు 4 నుంచి 12 శాతం రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో తీర్మానించామని, అత్యంత వెనుకబడిన తరగతుల వారి కోసం రూ. 1,000 కోట్లతో ప్రత్యేకంగా ఎంబీసీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశామని, ఏక కాలంలో రాష్ర్ట వ్యాప్తంగా 119 ఫూలే పేరిట బీసీ గురుకుల పాఠశాలలను నెలకోల్పామని, 19 బీసీ గురుకుల జూనియన్ కాలేజీలను ఏర్పాటు చేశామని, ఒక బీసీ గురుకుల డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేశామని మంత్రి జోగు రామన్న తెలిపారు.
బీసీ వసతి గృహాల్లోని విద్యార్థుల కోసం సన్న బియ్యం అందజేస్తున్నామని, ఫూలే పేరిట విదేశీ విద్య కోసం బీసీ విద్యార్థులకు రూ.20 లక్షలు అందజేస్తున్నామని ఆయన వివరించారు. స్వయం ఉపాధి కింద 29,427 మంది లబ్దిదారులకు ఆర్థిక సాయం చేశామని, బీసీ యువతులకు కల్యాణలక్ష్మీ కింద ఆర్థిక సాయం చేస్తున్నామని, స్టడీ సర్కిల్స్ ద్వారా నిరుద్యోగ యువతకు నిరంతరంగా కోచింగ్ ఇప్పిస్తున్నామన్నారు. బీసీలకు ఇచ్చే ఉపాధి రుణాల్లో రూ.లక్షకు 80 శాతం సబ్సిడీ, రూ. 2 లక్షలకు 70 శాతం , ఆ తరువాత రూ.10 లక్షల వరకు ఇచ్చే రుణాల్లో రూ.60 శాతం సబ్సిడీని ప్రభుత్వం భరిస్తోందని మంత్రి జోగు రామన్న తెలిపారు. దీని కన్నా మరింత మెరుగ్గా బీసీల కోసం ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అన్న అంశంపై తెలంగాణ బీసీ విజన్ – 2024 ద్వారా వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా సమగ్ర నివేదికను రూపొందించనున్నట్లు మంత్రి జోగు రామన్న తెలిపారు. ఈ సమావేశంలో బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, సభ్యులు డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, డాక్టర్ ఈడిగ ఆంజేయులు గౌడ్, గౌరీశంకర్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ విజయ్‌కుమార్, అదనపు కార్యదర్శి సైదా, అడిషనల్ డైరెక్టర్ అలోక్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.