వీధి రౌడీల కంటే దారుణంగా వ్యవహరించారు ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది. ఫ్లయిట్ ఎక్కే ప్రయాణికులు అంటే పెద్ద పెద్ద వ్యక్తులు ఉంటారు.. ప్రొఫెషనల్స్ ఉంటారు. అలాంటి వారితో మర్యాదగా ఉండాలి. ఇక ఎయిర్ లైన్స్ సిబ్బంది అంటే ఎంతో సహనంతో ఉంటారని అనుకుంటారు. కానీ ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది మాత్రం అందుకు భిన్నం. ఓ ప్రయాణికుడిని రన్ వే పైనే కింద పడేసి కొట్టారు. పెద్ద మనిషి అన్న ఇంగిత జ్ణానం లేకుండా వ్యవహరించారు. ఎయిర్ లైన్స్ గ్రౌండ్ సిబ్బంది ఒకరు.. ప్రయాణికుడిని కింద పడేసి గొంతు పట్టుకుని మరీ పిడిగుద్దులు గుద్దారు.
అక్టోబర్ 15వ తేదీన రాజీవ్ కటియాల్ అనే వ్యక్తి చెన్నై నుంచి ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో దిగారు. అక్కడి నుంచి మరో టెర్మినల్ కు వెళ్లటానికి ఇండిగో ఎయిర్ లైన్స్ బస్సులో ఎక్కటానికి వెళుతున్నాడు కటియాల్. సిబ్బంది బస్సు ఎక్కకుండా అడ్డుకున్నారు. విషయాన్ని ప్రశ్నించటంతో మాట మాటా పెరిగింది. దీనిపై సంయమనంతో.. సహనంతో వివరణ ఇవ్వాల్సిన ఇండిగో ఎయిర్ లైన్స్ గ్రౌండ్ సిబ్బంది.. ప్రయాణికుడితో దురుసుగా ప్రవర్తించారు. చేయి చేసుకున్నారు. ఈ తర్వాత కింద పడేసి కొట్టారు. పెద్ద మనిషితో ఇంత క్రూరంగా వ్యవహరించటంతో మిగతా ప్రయాణికులు షాక్ అయ్యారు. అందులో ఒకరు ఘటన మొత్తాన్ని వీడియో తీశారు. ఎయిర్ పోర్ట్ రన్ వే పైనే.. ఇలా కింద పడేసి కొట్టటం బహుశా దేశ చరిత్రలో ఇదే మొదటిది అంటున్నారు.
బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుతో అమర్యాదగా ప్రవర్తించిన ఘటన మరువక ముందే ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది బాగోతం మరోటి బయటపడింది. అంత కంటే ముందు.. ఇదే ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారంటూ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఘటనపై స్పందించిన ఇండిగో యాజమాన్యం.. ప్రయాణికుడికి వ్యక్తిగతం క్షమాపణలు చెప్పింది. సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకున్నాం.. అతన్ని విధుల నుంచి తొలగించాం అని ప్రకటించింది.