పంజాబ్‌లో ఘోరం జరిగింది. భటిండా జిల్లా బుచోమండి వద్ద రోడ్డుపక్కన ఉన్న యువకులపైకి లారీ దూసుకెళ్లింది. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. పలువురికి గాయాలయ్యాయి. ఉదయం 8.15 గంటల సమయంలో జరిగినట్టు తెలుస్తోంది. దట్టంగా అలుముకున్న పొగమంచు.. వాహన డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగింది.
కళాశాల, కోచింగ్ క్లాస్‌లకు వెళ్తున్న విద్యార్థుల బస్సులో సాంకేతికలోపం తలెత్తడంతో ఆగిపోయింది. దీంతో దాదాపు 14 మంది విద్యార్థులు వేరే బస్సు కోసం భటిండా- ఛండీగఢ్ హైవే రోడ్డు పక్కన నిలబడ్డారు. అదే సమయంలో అటువైపుగా వస్తున్న లారీ వేగంగా వారిపైకి దూసుకొచ్చింది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కారును ఢీ కొట్టిన తర్వాత ఆ వాహనం విద్యార్థుల మీదకు దూసుకెళ్లింది. దీంతో దాదాపు 9 మంది విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. దట్టంగా అలుముకున్న పొగ కారణంగా రహదారి కనిపించకపోవడం, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భటిండా ఎమ్మెల్యే, మంత్రి సహాయక చర్యలను దగ్గర ఉండి పర్యవేక్షించాల్సిందిగా ఆయన ఆదేశించారు. అంతకముందు యమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై పొగమంచు కారణంగా దాదాపు 18 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి.
Tags accident dethes panjab school boys