తెలంగాణ రాష్ట్ర అభివృద్దే ఎజెండాగా టీఆర్ఎస్ పని చేస్తోందని మంత్రి హరీశ్ తెలిపారు. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఇవాళ టిఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జితేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా వచ్చే ఎన్నికల్లో ఓడించాలని రావు ప్రజలను కోరారు.
పాలమూరులో ఆకలి, కరువు, వలసలకు గత ప్రభుత్వాలే కారణం అని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. అభివృద్ధే ధ్యేయంగా టీఆర్ఎస్ పనిచేస్తుంటే, అధికారం కోసం కాంగ్రెస్ అర్రులు చాస్తోందని విమర్శించారు. కొడంగల్ లో టిఆర్ఎస్ గెలుపుతోనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. పాలమూరు ప్రాజెక్ట్ ద్వారా కొడంగల్ లో లక్షా 10 వేల ఎకరాలకు నీళ్లిస్తామన్నారు. పాలమూరు జిల్లాలో రెండేళ్లుగా 500 చెరువులు నింపుతున్నామని మంత్రి హరీశ్ రావు వివరించారు. కాంగ్రెస్, టీడీపీ కలిసి పాలమూరును వలసల జిల్లాగా మార్చాయన్నారు. గత పాలకులు కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్ కింద 20 వేల ఎకరాలకే నీళ్లు ఇస్తే.. తాము మూడున్నరేండ్లలో ఆరున్నర లక్షల ఎకరాలకు నీరు ఇచ్చినమన్నారు. 500 చెరువులను నింపారన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ప్రతి ఊరికి రోడ్డు వేస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
కేసీఆర్ చావు నోట్లోకి వెళ్లి కేంద్రం మెడలు వంచి తెలంగాణ తెచ్చిన్రని మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు. ఆనాడు పదవులు త్యాగాలు చేసి తెలంగాణ కోసం కొట్లాడిన టీఆర్ఎస్ నేతలు కోదండరామ్ కు చేదు అయ్యారని, ఆనాడు రాజీనామాలు చేయకుండా తప్పించుకున్న తెలంగాణ ద్రోహులు ఆయనకు ముద్దు అయ్యారని విమర్శించారు.