అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఎనిమిదో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలిని చైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు కలిసి ఉద్యోగాల కల్పనపై చర్చకు చేపట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్‌లో తాగునీటి సరఫరాపై ఉన్న ప్రశ్నను బీజేపీ వాయిదా వేసుకోవడం సరికాదన్నారు. సభకు వచ్చి ప్రశ్నను వాయిదా వేసుకోవడం భావ్యం కాదన్నారు. హైదరాబాద్‌లో నీటి సమస్య లేదు కనుకనే.. వారికి ఏం అడగాలో ధైర్యం లేక ప్రశ్నను వాయిదా వేసుకున్నారని కేటీఆర్ తెలిపారు. నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉందని చెబుతుంటే.. బీజేపీ మాత్రం రచ్చ చేస్తుందని ధ్వజమెత్తారు. సభలో చర్చ చేయకుండా రచ్చ చేయడం ఏ రకమైన నీతి? అని కేటీఆర్ ప్రశ్నించారు. సభలో గొడవ చేయడం కరెక్ట్ కాదని బీజేపీ, కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి కేటీఆర్ అన్నారు.