శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఖమ్మం రైతులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందన్నారు. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి పోచారం స్పందించారు.రైతులపై ఎక్కడా అక్రమ కేసులు పెట్టలేదని మంత్రి స్పష్టం చేశారు. ఖమ్మంలో రైతులపై అక్రమ కేసులు పెట్టలేదు.. అవి సక్రమ కేసులేనని తెలిపారు. కనీస మద్దతు ధర అడిగినదానికి రైతులపై కేసులు పెట్టలేదు. అక్కడ కార్యాలయంపై దాడి చేసి.. ఆస్తులను, మిషనరీని ధ్వంసం చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే.. అధికారులకు అడ్డుపడితే ఎవరిపైనా సరే కేసులు పెడుతారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులపై కేసులు నమోదు అవుతున్నాయని చెప్పడం సరికాదన్నారు. 2010లో జమ్మికుంటలో, 2012లో దేవరకద్రలో, 2005లో బాదేపల్లి మార్కెట్‌యార్డులో రైతులు దాడులు చేశారని వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు నమోదు చేసినట్లు పోచారం శ్రీనివాస్‌రెడ్డి గుర్తు చేశారు.
