ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ పాదయాత్రని సోమవారం ప్రారంభించారు. మొదటి రోజు సక్సెస్ ఫుల్‌గా ముగిసిన పాదయాత్ర.. రెండోరోజు పాదయాత్ర ప్రారంభమయింది. వేంపల్లి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల మీదుగా సాగనుంది. ఈరోజు 12.9 కిలోమీటర్ల పాదయాత్రను జగన్ చేయనున్నారు.
అయితే వేలాది మంది అభిమానులు పాదయాత్రలో జగన్‌కు అండగా నిలబడేందుకు రావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ ఎందరో అభిమానులు జగన్ వెంట పాదయాత్ర చేస్తున్నారు. ఏడు నెలల పాటు ఆయనతోనే తాము అడుగులో అడుగు వేస్తామని చెబుతున్నారు. తండ్రి బాటలో నడుస్తున్న తనయుడు జగన్‌కి తోడుగా ఉంటామన్నారు.
ఇక గతంలో వైఎస్ ఇచ్చిన సంక్షేమ పథకాలు తమ కుటుంబాలకు దక్కాయని, అందుకోసమే ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు జగన్ వెంట నడవాలని తీర్మానించుకున్నామని కొందరు బహిరంగంగా చెబుతున్నారు. అయితే అభిమానులను, కార్యకర్తలను కట్టడి చేయడం పోలీసులకు సయితం కష్టంగా మారింది. జగన్ పాదయాత్ర కూడా నెమ్మదిగా సాగుతుండటానికి వేలాది మంది అభిమానులు తరలి రావడమే వైసీపీ నేతలు వివరణ ఇచ్చారు.