తిరుమలగిరులు ఒక ప్రకృతి అద్భుతం. అరుదైన జాతుల వృక్షాలు, జంతువులు, సర్పాలకు ఆవాసం. వీటితో పాటు ప్రతి చెట్టు, రాయి శ్రీవేంకటేశ్వరస్వామి స్వరూపమని పురాణాల కథనం. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో తిరుమలగిరులను అధిరోహించి స్వామివారిని దర్శించుకుంటారు. ఆధ్యాత్మిక భావనతో పాటు ప్రకృతి సోయగాలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. తిరుమలల్లో కురుస్తున్న వర్షాల కారణంగా దారి పొడవునా జలపాతాలు, సెలయేర్లు జలకళ సంతరించుకున్నాయి. వర్షం నిలిచి నిలిచి వస్తుండడంతో విరామంలో మేఘాలు మంచుతెరలను పంపుతున్నాయి. రెండో కనుమ రహదారిలో కొండరాళ్లపై నుంచి పడుతున్న జలపాతాల సోయగం భక్తులను కట్టిపడేస్తోంది. వాహనాల్లో వెళుతున్న యాత్రికులు దిగి జలపాతాల వద్ద చరవాణిలు, కెమెరాలతో ఛాయా చిత్రాలతో పాటు సెల్పీలు తీసుకుంటున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రకృతి అందాలు చూసి పులకించిపోతున్నారు. శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులను ఇది వరకెన్నడూ చూడని అందాలు పలకరిస్తున్నాయి. తిరుమల కనుమ రహదారుల్లో మేఘాలు చేతికందేంత కిందిదిగి పలకరిస్తున్నాయి. పొగమంచు దుప్పట్లు కమ్ముకుని అహ్లాదం కలిగిస్తున్నాయి. మల్వాడిగుండం, కపిలతీర్థంతో పాటు ఘంటాతీర్థం, ముక్కుతీర్థంతో నీళ్లు పెరిగి ప్రవహిస్తున్నాయి. అదే విధంగా మొదటి కనుమ రహదారిలో చెక్‌డ్యాంలన్నీ నిండిపోయి రోడ్డు వెంబడి సెలయేర్లు ప్రవహిస్తున్నాయి. అక్కగార్ల గుడి ఆలయ సమీపం అన్నమయ్య మార్గంలో వంతెనపై వెళుతున్న యాత్రికులకు పచ్చని చెట్లు, రంగురంగుల పుష్పాలతో లోయలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఈ ప్రకృతి అందాలు తిరుమల కనుమ రహదారులపై భక్తులను ఆనందపరవశులను చేస్తున్నాయి.
