ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలపై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు . శాసనసభలో ప్రశ్న వాయిదా వేసుకొని పారిపోయిన పరిస్థితి బీజేపీ సభ్యులది అని కేటీఆర్ విమర్శించారు. సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఉద్యోగాల కల్పనకు చర్చకు బీజేపీ నోటీసు ఇచ్చిందని తెలిపారు. దీనిపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇక ఇవాళ ఉదయం కిషన్‌రెడ్డి తనకు ఫోన్ చేసి.. ఇవాళ మొదటి ప్రశ్న తమదే ఉన్నది.. అది వాయిదా వేసుకుంటున్నామని చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే సభకు కిషన్‌రెడ్డి రావట్లేదేమో అనుకున్నాను. కానీ వారు సభకు వచ్చి ప్రశ్నను వాయిదా వేసుకొని ఉద్యోగాల కల్పనపై చర్చ చేపట్టాలనడం సరికాదన్నారు కేటీఆర్. మొదటి ప్రశ్న.. హైదరాబాద్‌లో తాగునీటి కొరతపై చర్చించకుండా.. సభలో చర్చకు రాకుండా రచ్చకు రావడం ఏ రకమైన నీతి? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని చెప్పినప్పటికీ ఈ రకమైన గొడవ చేయడం సరికాదన్నారు. హైదరాబాద్‌లో తాగునీటి కొరత లేనందు వల్లే.. ఏం అడగాలో ధైర్యం లేక ప్రశ్నలు వాయిదా వేసుకొని పారిపోయిన పరిస్థితి బీజేపీ సభ్యులది అని కేటీఆర్ విమర్శించారు. బీఏసీ నిర్ణయానికి ప్రతి సభ్యుడు కట్టుబడి ఉండాలన్నారు కేటీఆర్.