గత జన్మలో నువ్వు నా భార్యవి అంటూఓ సాధువు మహిళని అత్యాచారం చేయడం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని థానేకి చెందిన సాయిలాల్ జెధియా అనే వ్యక్తి తాను దైవస్వరూపాన్నంటూ కొన్నాళ్లుగా ప్రజలను మోసం చేస్తుండేవాడు.
మంత్రాలతో క్యాన్సర్ వంటి రోగాలను నయం చేస్తానంటూ ప్రజల నుంచి లక్షల్లో డబ్బు దోచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఓ మహిళ సాయిలాల్ వద్దకు సాయం కోసం వెళ్లింది. కానీ అతను గత జన్మలో నువ్వు నా భార్యవి అంటూ వివిధ ప్రదేశాలకు తీసుకువెళ్లేవాడు. ఆమె కూడా అతన్ని గుడ్డిగా నమ్మి వెళుతుండేది. అలా ఓసారి ఆమెను అసోంకు తీసుకువెళ్లి అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు.
దాంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. అప్పటికే సాయిలాల్ పరారీలో ఉన్నాడు. నెల రోజుల తర్వాత అతని ఆచూకీ తెలుసుకుని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణలో సాయిలాల్ చెప్పిన సమాధానాలు పోలీసులను షాక్‌కు గురిచేశాయి. ఫిర్యాదు చేసిన మహిళ గత జన్మలో తన భార్య అని అందుకే ఆమెతో అలా ప్రవర్తించానని చెప్పాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
