తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఈ రోజు శాసనసభలో భూరికార్డుల ప్రక్షాళనపై లఘు చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ భూభాగం 2.76 కోట్ల ఎకరాలు ఉందని తెలిపారు. మొత్తంగా తెలంగాణలో 10,885 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 10,806 గ్రామీణ ప్రాంత రెవెన్యూ గ్రామాలున్నాయని తెలిపారు. మొదటగా గ్రామీణ ప్రాంత రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేయాలని సూచించాం.
ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలకు మొదటగా పెట్టుబడి ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.1,418 అధికారుల బృందాలు ఎండ, వానకు తట్టుకొని.. భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో పాల్గొంటున్నాయని తెలిపారు. సెప్టెంబర్ 15న ప్రారంభమైన ఈ కార్యక్రమం డిసెంబర్ 31న ముగుస్తుందన్నారు.
రైతులకు పాస్‌పోర్టు కంటే పటిష్టంగా ఉండే పాస్‌బుక్‌లను పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 60 శాతం భూ రికార్డుల ప్రక్షాళన జరిగిందన్నారు. మిగిలిన 40 శాతం త్వరలోనే పూర్తవుతుందన్నారు. మొదటి విడుతగా 6,246 గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టారు. 3 వేల గ్రామాల్లో భూరికార్డుల ప్రక్షాళన పూర్తయిందన్నారు. 14 జిల్లాల్లో 90 శాతం భూరికార్డుల ప్రక్షాళన పూర్తి అయినట్లు సీఎం చెప్పారు. జగిత్యాల జిల్లాలో 99 శాతం భూరికార్డుల ప్రక్షాళన పూర్తి అయిందని స్పష్టం చేశారు.