అభం శుభం తెలియని పదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యంత పాశవికంగా అత్యాచారం జరిపి.. హతమార్చిన దారుణం మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. మృగంలా మారిన ఆగంతుకుడు బాలిక కాళ్లు కట్టేసి.. నోట్లో గుడ్డలు కుక్కి.. పశువాంఛ తీర్చుకున్న తర్వాత ఆమెను చంపేసి పొలాల్లో పడేశాడు. బాలిక మృతదేహంపై అనేకచోట్ల పళ్లతో కొరికిన గాట్లున్నట్లు పోలీసులు తెలిపారు. దేవాస్ జిల్లా సుంద్రెల్ గ్రామానికి చెందిన బాలిక శుక్రవారం సాయంత్రం తన తండ్రి కోసమని పొలానికి భోజనం తీసుకెళ్లింది. అనంతరం ఆమె జాడ తెలియరాకపోగా.. ఆదివారం ఉదయం వారి పొలానికి అర కిలోమీటరు దూరంలోనే అత్యంత దారుణస్థితిలో మృతదేహాన్ని కనుగొన్నారు. ఆమెకు బాగా తెలిసిన వ్యక్తే అత్యాచారానికి పాల్పడి.. విషయం బయటకు రాకుండా హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోస్ట్‌మార్టమ్ నిర్వహించిన వైద్యులు, ఫోరెన్సిక్ నిపుణుల నివేదిక ప్రకారం – బాలికపై అత్యాచారం జరిపి, వూపిరాడకుండా చేసి చంపినట్లు తేలింది. ఈమేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఇటీవల ఓ కళాశాల విద్యార్థినిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం జరిపిన ఘటనను మరిచిపోకముందే అదే రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది.
