ఆంధ్రా యూనివర్సిటీ సంస్కృత విభాగాధిపతి ఆచార్య కె.ఏడుకొండలుపై వర్సిటీ విద్యార్థినులు దాడి చేశారు! ఆయన తమపై సాగిస్తున్న లైంగిక వేధింపులను తట్టుకోలేక దాడికి పాల్పడినట్టుగ వారు ప్రకటించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని వారు ధర్నాకు దిగారు. వర్సిటీలో సోమవారం ఈ సంఘటనలు సంచలనం రేపాయి. వర్సిటీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థినుల ఫిర్యాదు స్వీకరించి ఆందోళనను విరమింపజేశారు.
గత ఏడాది మే నెలలో ఏడుకొండలు వర్సిటీ సంస్కృత విభాగానికి హెడ్ గా నియమితులు అయ్యారు. అప్పటి నుంచి ఆయన విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడనే ఆరోపణ వినిపిస్తోంది. పాఠాలు చెప్పడానికి వచ్చి శృంగార వర్ణనలున్న పాఠాలనే పదే పదే చెప్పేవాడని.. విద్యార్థులను అసభ్యంగా చూసేవాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. బోర్డుపై నగ్న చిత్రాలను గీసి వర్ణించే వాడని.. వీటన్నింటినీ తాము భరించాల్సి వచ్చేదన్నారు. తాజాగా సోమవారం ఒక విద్యార్థినిపై అసభ్యకరమైన కామెంట్లు చేయడంతో ప్రొఫెసర్ పై తిరగబడి దాడి చేసినట్టుగా వారు తెలిపారు.
విద్యార్థినులు ఏడుకొండలుపై దాడికి దిగడంతో అతడు కూడా ప్రతిదాడి చేశాడు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రొఫెసర్ పై దాడి చేసిన విద్యార్థినులు వర్సిటీలోనే ధర్నాకు దిగారు. ఉన్నతాధికారులు, ఇతర ప్రొఫెసర్లు వారికి సర్దిచెప్పడానికి ప్రయత్నించినా వినలేదు. చివరకు పోలీసులు రంగంలోకి దిగి ఫిర్యాదు స్వీకరించి విచారణ జరుపుతామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది.