భారత్-న్యూజిలాండ్ మూడో టీ20కి వర్షం ముప్పు పొంచివుంది. మ్యాచ్ జరుగుతుందా లేదా అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తిరువనంతపురంలో మంగళవారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాలి. ఇప్పటికే సిరీస్లో రెండు జట్లు 1-1తో సమంగా నిలవడంతో చివరి పోరు నిర్ణయాత్మకంగా మారింది. మూడు రోజులుగా అక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గ్రీన్ఫీల్డ్స్ అంతర్జాతీయ మైదానం మొత్తాన్ని సిబ్బంది కవర్లతో కప్పివుంచారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో రెండు జట్లు సాధనను రద్దు చేసుకున్నాయి.
నిమిషాల్లోనే సిద్ధం!
వర్షం కురిసినా ఇబ్బందేమీ లేదని కేరళ క్రికెట్ సంఘం అధికారులు చెప్తున్నారు. తాము అన్నిటికీ సిద్ధంగా ఉన్నామన్నారు. ‘స్టేడియంలో అద్భుత మురుగునీటి పారుదల వ్యవస్థ ఉంది. సాయంత్రం వర్షం కురిస్తే ఆగిపోయిన 20 నిమిషాల్లోపే మైదానం సిద్ధం చేయగలం. ఆదివారం రిహార్సల్ సైతం చేశాం. రోజు మొత్తం వర్షం కురిసినా నిమిషాల వ్యవధిలోనే సిద్ధం చేయగలం’ అని కేరళ క్రికెట్ సంఘం కార్యదర్శి జయేశ్ జార్జ్ తెలిపారు. ఇంతకు ముందు హైదరాబాద్ క్రికెట్ సంఘం నిర్లక్ష్యంతో భారత్, ఆస్ట్రేలియా మధ్య చివరి నిర్ణయాత్మక టీ20 బంతి పడకుండానే రద్దైన సంగతి తెలిసిందే.
