ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఫైర్ అయ్యారు .ఈ రోజు జగన్ పాదయాత్ర సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్రంలో పాదయాత్ర అంటే ముందు గుర్తుకు వచ్చే వ్యక్తి దివంగత రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. 2003లో అప్పటికే తొమ్మిదేళ్ల నుంచి కొనసాగుతున్న ఒక దుర్మార్గపు పాలనను అంతమొందించడానికి వైయస్సార్ పాదయాత్రను చేపట్టారని తెలిపారు. ప్రజా సమస్యలను, కష్టసుఖాలను తెలుసుకొని వైయస్ ప్రజల ముందుకు వచ్చారని చెప్పారు. రైతు సమస్యలను తీర్చాలనే ఉద్దేశంతో ఉచిత కరెంట్ ను ఇచ్చారని, విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్ మెంట్ ను ప్రవేశపెట్టారని, ప్రజల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని కొనియాడారు. పెద్ద పులిలాంటి వైయస్ ను చూసి… ఈ రాష్ట్రంలో ఒక నక్క దొంగ యాత్రలు చేసిందంటూ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు పగలంతా బస్సులో పడుకుని, రాత్రిపూట దొంగ పాదయాత్రలు చేశారంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను కూడా చంద్రబాబు నిలబెట్టుకోలేకపోయారని మండిపడ్డారు. ప్రజల సంక్షేమం కోసమే జగన్ పాదయాత్ర చేపడుతున్నారని… ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల సమస్యలన్నింటినీ జగన్ పరిష్కరిస్తారని చెప్పారు.
