తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ రోజు శాసనసభలో భూ రికార్డుల ప్రక్షాళనపై చర్చ జరిగింది .ఈ చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలో భూ రికార్డుల ప్రక్షాళన జరుగుతుందని వ్యాఖ్యానించారు.ఎమ్మెల్యే భట్టి వ్యాఖ్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుబట్టారు.
రైతు సమన్వయ సమితుల ఆధ్వర్యంలో రికార్డుల ప్రక్షాళన జరగడం లేదన్నారు.సమన్వయ సమితుల పని వేరు, రికార్డుల ప్రక్షాళన వేరు అని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సమన్వయ సమితులను భూ రికార్డుల ప్రక్షాళనలో జోక్యం చేసుకోవాలని ఎక్కడా చెప్పలేదని సీఎం తెలిపారు. భట్టి విక్రమార్క సభను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం పేర్కొన్నారు. భట్టి వ్యాఖ్యలను రికార్డుల్లోంచి తొలగించాలని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా సూచించారు.
గత ప్రభుత్వాలు రెగ్యులర్ గా భూ రికార్డులు అప్ డేట్ చేస్తే.. సాదా బైనామాల రిజిస్ట్రేషన్ కోసం 11 లక్షల దరఖాస్తులు ఎందుకు వస్తాయని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. వాటన్నిటిని ఎటువంటి ఫీజు లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తున్నామని తెలిపారు. భూ రికార్డుల ప్రక్షాళనను హర్షించాల్సింది పోయి.. వ్యతిరేకించడం తగదన్నారు సీఎం. రైతుల పెట్టుబడి కోసమే రికార్డుల ప్రక్షాళన చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ఎకరానికి రూ. 4 వేల చొప్పున రెండు పంటలకు పెట్టుబడి అందిస్తామని చెప్పిన నేపథ్యంలో.. ఏ రైతుకు ఎంత భూమి ఉందో సర్వే ద్వారా స్పష్టంగా తెలుస్తుందన్నారు సీఎం.
ఇక అసెంబ్లీ సమావేశాలు ఎప్పటికప్పుడు టీవీల్లో ప్రసారం కావడంతో తాము బతికిపోతున్నామని సీఎం పేర్కొన్నారు. ప్రజలను, రైతులను, సభను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. ఏ సభ్యుడు ఏం మాట్లాడుతున్నారో ప్రజలందరూ చూస్తున్నారని సీఎం తెలిపారు. ఈ లైవ్ టెలికాస్ట్ వల్ల తాము బతికిపోయామని సీఎం అన్నారు. ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇవ్వాలి కానీ.. ప్రతి విషయాన్ని వ్యతిరేకించడం ప్రధాన ప్రతిపక్ష సభ్యులకు తగదని సీఎం కేసీఆర్ అన్నారు.