వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. ఇడుపులపాయలో వైఎస్ సమాధికి నివాళులర్పించిన జగన్ ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించారు. ఇడుపులపాయలో ప్రారంభమైన జగన్ యాత్ర ఇచ్ఛాపురం వరకూ దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేరకు సాగనుంది. 2019 అధికారమే లక్ష్యంగా ఈ యాత్రను చేపట్టనున్న జగన్ రోజుకు 14 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు.
ఇక జగన్ తొలిరోజు పాదయాత్రలో భాగంగా నిర్వహించిన సభలో చాలా కసితో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో రైతులు, చేనేతలు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడంలేదని, రాష్ట్రంలోని ఏ ఒక్క కుటుంబం కూడా సంతోషంగా లేదని, ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరికీ భరోసా ఇచ్చేందుకు తాను పాదయాత్ర చేపడుతున్నట్టు వైఎస్ జగన్ అన్నారు.
అంతే కాకుండా.. తనకు ఒక కసి ఉందని చనిపోయిన తర్వాత కూడా.. ఆ మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాగా పేదవాడి గుండెల్లో బతకాలనేదే ఆ కసి అని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా తేవాలనే కసితో ఉన్నానని.., ప్రతి యువతకు ఉద్యోగం ఇప్పించాలనే కసి తనలో ఉందని అన్నారు. సంక్షేమ పథకాలతో ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలనే కసి తనకుందని చెప్పారు.
ఇక చివరిగా.. మద్య నిషేధాన్ని విధించాలనే కసి తనలో ఉందని అన్నారు. అవినీతిపరులందరినీ జైల్లో పెట్టించాలనేది తన కసి అని చెప్పారు. చంద్రబాబు అండ్ కో చేస్తున్న అరాచక పాలనకు ముగింపు పలకాలనే ఉద్దేశంతోనే పాదయాత్రకు శ్రీకారం చుట్టానని… మీ అందరి ఆశీస్సులు తనకు కావాలని ప్రజలకు కోరారు. దీంతో పాదయాత్ర తొలిరోజు జగన్ తన ప్రసంగాన్ని దంచి కొట్టడంతో.. వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపగా.. జగన్‌లో ఉన్న మరో కోణం బయట పడిందని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.