రాష్ట్ర ప్రజలసమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమై.. ఎన్నికల నాటికి ప్రజలు దిద్దిన మేనిఫెస్టోను తీసుకొచ్చేందుకు వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రాత్మకమైన ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించారు. కనీవినీ ఎరుగని రీతిలో.. అట్టహాసంగా ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్రలో జగన్ బ్లాస్టింగ్ ప్రసంగం చేశారు.
ఇక ఆ ప్రసంగంలో జగన్ మాట్లాడుతూ.. దివంగత మహానేత రాజశేఖర రెడ్డికి మరణం లేదని… ఎందుకంటే ఆయన చనిపోయినా, ప్రతి గుండెలో ఆయన నిలిచే ఉన్నారని జగన్ అన్నారు. తనను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు నేతలు చేయని ప్రయత్నాలు లేవని మండిపడ్డారు. చంద్రబాబు ఆలోచనలు చాలా దుర్మార్గంగా ఉన్నాయని పైర్ అయ్యారు.
చంద్రబాబు తన కుమారుడి వయసున్న తనను రాజకీయంగా తప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని… వీటిని చూసినప్పుడు తనకు చాలా బాధ కలుగుతుందని చెప్పారు. నాన్నగారు చనిపోతూ తనకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చి పోయారని… మిమ్మల్ని చూస్తున్నప్పుడు తనకు ఎంతో ఊరట కలుగుతుందని అన్నారు.
గత ఎనిమిదేళ్లుగా ప్రభుత్వ పెద్దలతో పోరాటం చేస్తున్నానని… అయినా, తాను వేసిన ప్రతి అడుగు వెనకా మీరు ఇచ్చిన భరోసా ఉందని… మనందరినీ చూసి ఇప్పుడు చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తే పరిస్థితి ఉందని చెప్పారు. ఇడుపులపాయలోని సభాప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయగా.. అక్కడ సభ మొత్తం దద్దరిల్లి పోయింది.