వైసీపీ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి చెపట్టే ప్రజా సంకల్ప యాత్రకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఆయన కోసం మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి జగన్ జరిపిన ఓదార్పు యాత్ర రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనమే అయ్యింది. నేరుగా జనంలోకే వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని బాధితులకు నేనున్నానని భరోసా ఇచ్చారు. ఇప్పటికే నవరత్నాలు ప్రకటించి ఇంటింటికీ వీటిని తీసుకుని వెళ్లే కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు సన్నద్ధం అయ్యారు. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయబోతున్నారు. నవరత్నాల హామీలను మరింత మెరుగు పరచేలా ప్రజల నుంచి వచ్చే సలహాలను స్వీకరించి ఎన్నికల నాటికి ప్రజలు దిద్దిన మేనిఫెస్టోను తీసుకు రావడం కోసం జగన్ సన్నద్ధమయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరినీ భాగస్వాములను చేయడానికి ఎన్ని కుట్రలు ఎదురైనా ఎదురించి సుదీర్ఘ యాత్ర ప్రారంభిస్తున్నారు. ఈ యాత్ర ఎలా సాగుతుంది? జగన్ ఏ విధంగా ముందడుగు వేయబోతున్నారు? అని అటు రాజకీయ వైరిపక్షాలు, ఇటు అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
నేడు పాదయాత్ర ఇలా..
సోమవారం ఉదయం 9.30 గంటలకు పాదయాత్ర ప్రారంభించి మారుతినగర్ మీదుగా మధ్యాహ్నం 1 గంటకు భోజన విరామ ప్రాంతానికి చేరుకుంటారని చెప్పారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభించి వీరన్నగట్టుపల్లె కూడలిలో పార్టీ జెండా ఆవిష్కరణ చేస్తారని, అక్కడి నుంచి కుమ్మరాంపల్లె మీదుగా వేంపల్లె శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బసకు చేరుకుంటారని వారు తెలిపారు. జగన్‌కు రాత్రి విడిది కోసం టెంట్‌లు ఏర్పాటు చేశారు. ఆయన టెంట్‌లోనే నిద్రపోతారు. ప్రతి రోజు ఉదయం తన కోసం వచ్చిన వారితో పాటు, పార్టీ కార్యకర్తలు, నాయకులను కలుసుకుంటారు. రోజూ ఉదయం 7 కిలో మీటర్లు, సాయంత్రం 7 కిలో మీటర్ల చొప్పున పాదయాత్ర చేసేలా కార్యక్రమం ఖరారు చేశారు. మంగళవారం మధ్యాహ్నానికి పాదయాత్ర కమలాపురం నియోజకవర్గంలోని వీరపునాయునిపల్లె మండలంలోకి ప్రవేశిస్తుంది. రాత్రి ఈ మండలంలోనే ఆయన బస చేస్తారు.