ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమై.. ఎన్నికల నాటికి ప్రజలు దిద్దిన మేనిఫెస్టోను తీసుకొచ్చేందుకు వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రాత్మకమైన ‘ప్రజాసంకల్ప యాత్ర’ ప్రారంభించారు. జనసంద్రమైన ఇడుపులపాయలో ప్రజలతో మమేకమై.. పార్టీ నేతలు వెంటరాగా.. వైఎస్ జగన్ తొలి అడుగులు వేశారు. ప్రజలను పలుకరిస్తూ.. కార్యకర్తలతో ముచ్చటిస్తూ.. ఆయన ‘ప్రజా సంకల్ప’ యాత్రను కొనసాగిస్తున్నారు.
అంతకుముందు పులివెందులలో తన నివాసంలో తల్లి విజయమ్మ నుంచి ఆశీస్సులు తీసుకొని.. సోదరి షర్మిల, ఇతర కుటుంబసభ్యులకు వెళ్లొస్తానని చెప్పి.. అశేషమైన అభిమానులు, కార్యకర్తల మద్దతు నడుమ వైఎస్ జగన్ ఇడుపులపాయకు బయలుదేరారు. ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద మహానేతకు కుటుంబసభ్యులతో కలసి వైఎస్ జగన్ నివాళులర్పించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జనంతో మమేకమై.. తొలి అడుగులు వేస్తూ ‘ప్రజాసంకల్ప యాత్ర’ను ప్రారంభించారు.
వైఎస్ జగన్ ‘ప్రజాసంకల్ప యాత్ర’కు వేదికైన ఇడుపులపాయలో అశేషమైన జనవాహినితో కిక్కిరిసిపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్దసంఖ్యలో ఇడుపులపాయకు చేరుకున్నారు. పెద్దసంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులు, ప్రజలు ఇక్కడకు చేరుకోవడంతో ఇడుపులపాయ కోలహలంగా మారింది.