ప్రయివేటు కార్పొరేట్ కళాశాలల పేర్లు చూసి విద్యార్థుల తల్లిదండ్రులు మోసపోవద్దని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సూచించారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కడియం మాట్లాడారు. కార్పొరేట్ కళాశాలల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయా కాలేజీలకు గుర్తింపు ఉందా? లేదా? అన్న విషయం తెలుసుకొని అడ్మిషన్స్ తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే 150 కార్పొరేట్ కాలేజీ హాస్టళ్లలో ప్రభుత్వం తనిఖీలు జరిపిందన్నారు. ఆ కళాశాలల్లో నెలకొన్న పరిస్థితులపై ఆ కాలేజీ యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చామన్నారు. 2018 మార్చిలోగా ప్రయివేటు విద్యాసంస్థల అఫ్లియేషన్లు, గుర్తింపు ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 2018-19 ఏడాదికి కళాశాలలు ప్రవేశాలు జరపవద్దని నోటీసులు ఇచ్చాం. ఇప్పటికే ప్రవేశాలకు సంబంధించి ప్రక్రియ ప్రారంభించినట్లు తెలుస్తుంది. అటువంటి కళాశాలలపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. పాఠశాలలు, కళాశాలల్లో పరిస్థితులపై కమిటీ ఏర్పాటు చేశాం. నవంబర్‌లో కమిటీ నివేదిక ఇవ్వగానే తదుపరి చర్యలు తీసుకుంటాం. కార్పొరేట్ స్కూల్స్, కాలేజీల్లో ఫీజులు నియంత్రిస్తామని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.
