కడెం ప్రాజెక్టుపై కుప్తి ప్రాజెక్టు నిర్మిస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు . శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. 5 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో కడెం నదిపై కుప్తి ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కడెం ప్రాజెక్టు సామర్థ్యం 7.2 టీఎంసీలు ఉన్నప్పటికీ.. కేవలం 4 టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నామని తెలిపారు. మిగతా 3 టీఎంసీలు డెడ్ స్టోరేజీ అని చెప్పారు. కడెం ప్రాజెక్టు ఎత్తు పెంచితే అటవీ భూములు ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే రైతులు నాలుగైదు సంవత్సరాలు పంటలు వేసుకునే అవకాశం లేకుండా పోయే అవకాశం ఉందన్నారు. అందుకే కడెం ప్రాజెక్టుకు అనుబంధంగా 5 టీఎంసీల సామర్థ్యంతో కుప్తి ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 68 వేల ఎకరాలకు రెండు పంటలకు నీరు ఇస్తామని ప్రకటించారు. అతి తక్కువ ముంపుతో కుప్తి ప్రాజెక్టు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. కుప్తి ప్రాజెక్టు డీపీఆర్‌ను ఈ మధ్యలోనే ప్రభుత్వానికి సమర్పించారు. త్వరలోనే ప్రభుత్వంతో చర్చించి పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తామని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు.