ఎస్సీ వర్గీకరణ న్యాయమైన అంశమని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. శాసనసభలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఏవరూ కోరకపోయినప్పటికీ 29 నవంబర్ 2014 నాడు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం పెట్టిందని గుర్తు చేశారు. ఆ రోజు ఎస్సీ వర్గీకరణపై ఈ సభ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయం అందరికీ తెలుసన్నారు. ఇప్పటి దాకా వాకౌట్ చేసిన కాంగ్రెస్.. పది సంవతసరాల పాటు ఇక్కడ, అక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణను పట్టించుకోలేదని కోపోద్రిక్తులయ్యారు. సీఎం కేసీఆర్, కడియం శ్రీహరి కలిసి ఈ విషయాన్ని ఢిల్లీలో నరేంద్ర మోదీకి దృష్టికి తీసుకెళ్లారని గుర్తు చేశారు. అఖిలపక్షాన్ని తీసుకెళ్లే ముందు ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ రద్దు అయిందన్నారు. వర్గీకరణ న్యాయమైన అంశం కాబట్టి.. తప్పకుండా మోదీ అపాయింట్‌మెంట్ తీసుకుని కచ్చితంగా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని చెప్పారు. అవసరమైతే మరోసారి ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని తెలిపారు ఈటల.