మాజీమంత్రి పీ జనార్దనరెడ్డి తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి హైదరాబాద్‌లో తన ఇంటి పక్కనే ఉన్న ఓ ఎన్నారై ఇంటిని ఆక్రమించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికార దర్పంతో అడ్డగోలు వ్యవహారానికి పాల్పడ్డారు. హైదరాబాద్ నడిబొడ్డున.. ప్రపంచ ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ కర్వాండేకు చెందిన కోట్ల రూపాయల విలువ చేసే ఇంటిని, దాని పక్కనే ఉంటున్న విష్ణువర్ధన్‌రెడ్డి అదును చూసుకొని ఆక్రమించుకొన్నారు. అమెరికాలో స్థిరపడ్డ డాక్టర్ శ్రీకాంత్ సోదరులు ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి వస్తే.. ఈ ఏరియాలో కనిపిస్తే చంపేస్తామంటూ విష్ణు అనుచరులు వెంటపడి తరిమారు. వారు పోలీసులను ఆశ్రయిస్తే తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు.
దొంగ డాక్యుమెంట్ల సృష్టి
దోమల్‌గూడలో మాజీ సీఎల్పీనేత దివంగత పీజేఆర్ ఇంటి పక్కనే 798 గజాల విస్తీర్ణంలో కర్వాండేల ఇల్లు ఉన్నది. నిజాం కాలంలో సింగరేణి జనరల్ మేనేజర్‌గా పనిచేసిన లక్ష్మణ్‌రావు కర్వాండే కొడుకులు వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడటంతో తల్లి విమల్ కర్వాండే ఒక్కరే ఈ ఇంట్లో ఉండేవారు. వయసుపైబడటంతో ఆమె కుమారుల వద్దకు 2005లో అమెరికాకు వెళ్లారు. అప్పటినుంచి ఈ ఇంటిపై కన్నేసిన పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డి తన రాజకీయ పలుకుబడితో ఈ ఇంటిని కబ్జా చేశారు. సదరు ఇంటిని తనకు అమ్ముతున్నట్టుగా విమల్ కర్వాండే 2005లో సేల్ అగ్రిమెంట్ చేసినట్టుగా ఒక డాక్యుమెంట్‌ను సృష్టించారు. 2013లో ఆ ఇంటికి తన చేతుల్లోకి తీసుకొన్నారు. ఈ ఇంటి యజమానులు శ్రీకాంత్ అతని సోదరులు వస్తే.. ఈ ఇల్లు మీ అమ్మ మాకు విక్రయించిందంటూ వెళ్లగొట్టారు..
అంతా మోసం
విమల్ కర్వాండే అగ్రిమెంట్ చేశారని చూపించిన డాక్యుమెంట్లు పరిశీలిస్తే ఏవిధంగా చీటింగ్ చేశారో స్పష్టమవుతుంది. విమల్ కర్వాండే 2005 మార్చి 24వ తేదీన ముంబై నుంచి అమెరికాకు వెళ్లినట్టు పాస్‌పోర్ట్ మీద ఇమ్మిగ్రేషన్ అధికారులు ముద్ర వేశారు. కానీ ఏప్రిల్ 1న గ్రేస్ కన్‌స్ట్రక్షన్ పేరుతో విష్ణు అనుచరులైన మహ్మద్ గౌస్ ఖాన్, మహమూద్ ఖాన్‌లకు సేల్ అగ్రిమెంట్ చేసిన డాక్యుమెంట్ సృష్టించారు. ఆ ఇంటిని రూ.2.35 కోట్లకు విక్రయించినట్లు, అడ్వాన్స్‌గా రూ. 20 లక్షలు ఇచ్చినట్లు రాశారు. ఈ డబ్బు ఏరూపంలో ఇచ్చారో అందులో పేర్కొనలేదు. పైగా మిగిలిన రూ. 2.15 కోట్లు ఏకంగా నాలుగేండ్ల తర్వాత ఇచ్చేటట్లుగా రాసుకొన్నారు. ఇది కనీసం రిజిస్టర్ అగ్రిమెంట్ కూడా కాదు. నిజానికి ఎవరైనా తమ ఆస్తిని అమ్ముకొన్నప్పుడు పూర్తి చెల్లింపులకు ఎక్కువలో ఎక్కువగా 18నెలల అగ్రిమెంట్ రాసుకొంటారు. ఇప్పుడైతే ఈ కాలపరిమితి ఆర్నెల్లు కూడా ఉండటంలేదు. అలాంటిది ఏకంగా నాలుగేండ్లు రాసుకోవడం..
అదీ అమెరికాకు వెళ్లిన మనిషి ఆరు రోజుల్లో తిరిగి వచ్చి అగ్రిమెంట్ చేసినట్టుగా చూపించడం విడ్డూరం. ఈ పత్రాలలో విమల్ సంతకాలను ఫోర్జరీ చేసినట్లుగా ట్రూత్‌ల్యాబ్ పరీక్షల్లో తేలింది. ఈ వివాదం నుంచి బయటపడేందుకు శ్రీకాంత్, ఆయన సోదరులు తమ ఇంటిని డెవలప్ చేయించడానికి మనీషా కన్‌స్ట్రక్షన్‌తో అగ్రిమెంట్ చేసుకొని, ఆ ఇంటిని అప్పగించేందుకు వెళ్తే అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న విష్ణు అడ్డుకొన్నారు. ఆయనపై మనీషా కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. పైగా ఆనాటి నుంచి విష్ణు తన అనుచరులను ఆ ఇంట్లో నివాసముంచారు. ఇంటి యజమానులను ఆ ఇంటి దరికి కూడా రానీయడం లేదు. ఇది బోగస్ అని తేలిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ నేతల ఒత్తిడికి తలొగ్గిన పోలీసులు ఇప్పటికి కూడా ఈ ఇంటిని యజమానులకు అప్పగించలేదు.