ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేరకు ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహించనున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఈ రోజు ఉదయం జగన్ వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి ‘ప్రజాసంకల్ప యాత్ర’ ప్రారంభించారు. మొదట మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ఘాట్‌ను సందర్శించిన వైఎస్ జగన్ కుటుంబసభ్యులతో కలిసి.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జనసంద్రమైన ఇడుపులపాయ నుంచి ప్రజలతో మమేకమై.. పార్టీ నేతలు వెంటరాగా తొలి అడుగులు వేస్తూ ఇడుపులపాయ ఎగ్జిట్ వద్దకు నడుచుకుంటూ వచ్చి.. బహిరంగ సభలో ప్రసంగించారు.ఈ క్రమంలో ఉద్యోగ వర్గాలపై జగన్ హామీల జల్లు కురిపించారు. తాము అధికారంలోకి రాగానే ప్రతి ఉద్యోగికి స్థలం ఇచ్చి.. ఇల్లు కట్టిస్తామని వాగ్దానం చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. ఉద్యోగులకు కాంట్రీబ్యూటరీ పెన్షన్‌ను అమలుచేస్తామని హామీ ఇచ్చారు. జాబు రావాలంటే బాబు రావాలని గత ఎన్నికల్లో ప్రచారంతో ఊదరగొట్టారని, కానీ ఇప్పుడు జాబు రావాలంటే బాబు పోవాల్సిందేనని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.
