ముంబై మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్యూస్ సంచలనం సృష్టించింది. ఆదివారం జరిగిన అండర్-19 వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో సత్తా చాటింది. స్మృతి మందన తర్వాత అండర్-19 వన్డే క్రికెట్లో ద్విశతకం సాధించిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. 16 ఏళ్ల జెమిమా కేవలం 163 బంతుల్లోనే 202 పరుగులతో నాటౌట్‌గా నిలవడం విశేషం. ఔరంగాబాద్ వేదికగా సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలో దిగిన జెమిమా ఈ ఘనత సాధించింది. 13వ ఏటే అండర్-19 జట్టుకి ఎంపికైన జెమిమా 300కిపైగా సగటుతో ఇప్పటికే రెండు సెంచరీలను తన ఖాతాలో వేసుకుంది.
జెమిమా ఈ మ్యాచ్ ఆరంభంలో నెమ్మదిగా ఆడింది. 52 బంతుల్లో 53 పరుగులు చేసిన ఈ టీనేజర్.. 83 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుంది. తర్వాత గేర్ మార్చిన జెమిమా 163 బంతుల్లో 202 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. రౌత్‌తో కలిసి రెండో వికెట్‌కు 300 పరుగులు జోడించింది. దీంతో ముంబై జట్టు 347 పరుగులు చేసింది. బదులుగా సౌరాష్ట్ర కేవలం 62 పరుగులకే ఆలౌటయ్యింది. దీంతో ముంబై జట్టు 285 పరుగుల భారీ ఆధిక్యంతో ఘన విజయం సాధించింది.
చిన్నవయసులోనే బౌలర్‌గా కెరీర్ ఆరంభించిన జెమిమా తర్వాత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌విమెన్‌గా మారింది. ప్లాస్టిక్ బాల్‌తో క్రికెట్ ఆడటం మొదలు పెట్టిన ఈ అమ్మాయి.. అండర్-17 హాకీలో ముంబై తరఫున సత్తా చాటుతోంది. ప్రస్తుతం భారత జట్టు తరఫున ఆడుతున్న స్మృతి మందన 2013లో 224 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.