డిప్రెషన్‌తో బాధపడుతూ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని అంటోంది గోవా బ్యూటీఇలియానా. ఆదివారం దిల్లీలో నిర్వహించిన 21వ ‘వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ మెంటల్ హెల్త్’ కార్యక్రమంలో ఇలియానా పాల్గొంది. ఈ కార్యక్రమంలో ఇలియానా ‘ఉమెన్ ఆఫ్ సబ్‌స్టెన్స్’ అవార్డు కూడా అందుకొంది. ఈ సందర్భంగా జీవితంలో తాను ఎదుర్కొన్న ఒత్తిళ్ల గురించి చెప్పుకొచ్చింది.
‘నా శరీరాకృతి గురించి ఎక్కువగా కామెంట్లు చేసేవారు. దాంతో ఎప్పుడూ చాలా ఒత్తిడికి గురవుతూ బాధపడుతూ ఉండేదాన్ని. కానీ నేను డిప్రెషన్‌తో బాధపడుతున్నానన్న విషయం నాకు ఎవరో చెప్పేవరకూ తెలీలేదు. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వచ్చేవి. అలాంటి సమయంలో నాకు నేను ధైర్యం చెప్పుకుంటూ నెమ్మదిగా నన్ను నేను మార్చుకుంటూ వచ్చాను. డిప్రెషన్ నుంచి బయటపడాలంటే మొదటగా చేయాల్సిన పని మనకు మనం ధైర్యం చెప్పుకోవడమే’
‘మన మెదడులో జరిగే రసాయన చర్యలకు అణుగుణంగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. దానంతట అదే తగ్గిపోతుందిలే అనుకుంటూ నిర్లక్ష్యం చేస్తే తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. మనకు ఏదన్నా దెబ్బ తగిలినా, నొప్పిగా ఉన్నా వైద్యుల వద్దకు వెళతాం కదా. అదే విధంగా డిప్రెషన్‌గా అనిపించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలి.నటీనటులను చూడగానే చాలా మంది వాళ్లు ఎంత చక్కగా ఆరోగ్యంగా ఉంటారోనని అనుకుంటారు. మేము ఇంత అందంగా కన్పించడానికి రెండు గంటలు పడుతుంది. కానీ మీ మనసు ఆనందంగా ప్రశాంతంగా ఉంటే ఎలాంటి మేకప్‌లు అవసరం లేదు.’ అని చెప్పుకొచ్చింది ఇలియానా.
