ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేర ‘ప్రజా సంకల్పం’ పాదయాత్ర ఆ పార్టీ శ్రేణుల్లో ,జగన్ అభిమానుల్లో ఊపు, ఉత్సాహం పెంచింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు పలు చోట్ల జగన్‌కు మద్దతుగా నిన్న శనివారం తమ నియోజకవర్గాల పరిధిలో పాదయాత్రలు చేపట్టారు.
జగన్ యాత్ర విజయవంతం కావాలని కోరుతూ పూజలు, ప్రార్థనలూ నిర్వహించారు. సర్వమత ప్రార్థనలూ చేశారు.ఈ క్రమంలో రాష్ట్రంలో అనంతపురం జిల్లా తనకల్లు, ధర్మవరం, బత్తలపల్లిలో పార్టీ నేతలు జగన్ యాత్రకు సంఘీభావంగా పాదయాత్ర నిర్వహించారు. కర్నూలు జిల్లా నందికొట్కూరులో ఎమ్మెల్యే ఐజయ్య పూజలు నిర్వహించగా, శ్రీశైలంలో నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా శేషారెడ్డి 1001 కొబ్బరికాయలను మల్లన్నకు సమర్పించారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్టీసెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం నుంచి మద్ది పుణ్యక్షేత్రానికి 20 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఉంగుటూరు, దెందులూరు, తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం, అన్నవరం, ప్రకాశం జిల్లా కొండపి, విశాఖ జిల్లా పశ్చిమ, అరకు నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు పాదయాత్రలు నిర్వహించారు.