ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న శనివారం ఉదయం తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న సందర్భంగా బాబు వర్గానికి చెందిన ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ తప్పుడు ప్రచారానికి దిగింది. ప్రతిపక్ష నేతతో పాటు వచ్చిన ఒక మహిళా నాయకురాలు క్యూలైను వరకు చెప్పులతో వెళ్ళినట్లు పదే పదే ప్రసారం చేసింది. వాస్తవానికి జగన్‌తో సహా వెంట వచ్చిన నాయకులు, కార్యకర్తలు ముందుగానే చెప్పులు వదిలి వెళ్ళారు.
సాధారణంగా వైకుంఠం క్యూకాంప్లెక్సు వెలుపలి వరకు పాదరక్షలు అనుమతిస్తారు. అయితే, జగన్ వెంట దైవదర్శనానికి పెద్దఎత్తున తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలు అందరూ చాలా దూరంలోనే చెప్పులు వదిలి క్యూకాంప్లెక్సులోకి ప్రవేశించారు. ప్రతిపక్ష నేత పాదరక్షలు కారులోనే వదిలి వచ్చారు.అయితే వాస్తవం ఇలా ఉండగా… ఎవరో నాయకురాలు పాదరక్షలతోనే క్యూకాంప్లెక్సులోకి ప్రవేశించారంటూ ఆ చానల్ స్క్రోలింగ్‌లు ఇచ్చింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నదీ హారతి, శంకుస్థాపనలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బూట్లతోనే పాల్గొన్నా పట్టించుకోని ఆ ఛానల్ జగన్ విషయంలో పనిగట్టుకుని అవాస్తవాన్ని ప్రచారం చేయటం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.ఈ క్రమంలో బెజవాడలో రోడ్ల విస్తరణ పేరుతో ప్రభుత్వం దేవాలయాలను కూల్చివేసిన సందర్భంలోనూ తప్పుపట్టని ఆ చానల్ ఇలాంటి దుష్ప్రచారానికి ఒడిగట్టడం పక్షపాతం కాక మరేమిటని ప్రశ్నిస్తున్నారు. వైదిక కార్యక్రమాలకు ఉద్దేశించిన సదావర్తి సత్రం భూములను అప్పనంగా తమ పార్టీ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రిని వెనకేసుకొచ్చే ఆ చానల్… ప్రతిపక్షం మీద పనిగట్టుకొని బురదజల్లటం వెనుక ఏ స్వార్ధ ప్రయోజనాలు దాగున్నాయని పలువురు ప్రశ్నిస్తున్నారు.