తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముస్లిం వర్గం యొక్క సంక్షేమం, అభివృద్ధికి కేసీఆర్ సర్కారు చేస్తున్న కృషి అమోఘమని ఎంఐఎం అధినేత, పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అందులో భాగంగా ప్రత్యేకించి ముస్లిం సమాజంలో నిరక్షరాస్యత నిర్మూలనకు సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలవంటివి గతంలో ఎన్నడూ జరుగలేదన్నారు. అందుకే తాము సీఎం కేసీఆర్‌కు మద్దతిస్తున్నామని స్పష్టంచేశారు.
శనివారం ఇక్కడి శివరాంపల్లిలో అఖిల భారత ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటీ (ఏఐఎంఈఎస్) పదో జాతీయ సదస్సు ప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సదస్సుకు వివిధ రాష్ర్టాలనుంచి ముస్లిం రాజకీయ నేతలు, విద్యావేత్తలు, మత ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ మాట్లాడుతూ నా 23 ఏండ్ల రాజకీయ జీవితంలో కేసీఆర్‌లాంటి సీఎంను చూడలేదు. గతంలో ఏ ముఖ్యమంత్రికూడా కేసీఆర్ తరహాలో ముస్లింల సంక్షేమం, సమస్యలపై సానుకూలంగా స్పందించలేదు అని చెప్పారు.
ముస్లింలలో నిరక్షరాస్యతను రూపుమాపేందుకు 204 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు, రెండు మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన విషయాన్ని, విదేశాల్లో చదువుకునేందుకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్ ఇస్తుండటాన్ని ప్రస్తావించారు. రాబోయే పదేండ్లలో రాష్ట్రంలోని ముస్లిం సమాజంలో కొత్త విద్యావిప్లవం వస్తుందని అసదుద్దీన్ అన్నారు. తాను సీఎంను ఎప్పుడు కలిసినా ముస్లిం సమాజ సమస్యలను అడిగి తెలుసుకుంటారని, సానుకూలంగా స్పందిస్తారని ఆయన చెప్పారు. మైనారిటీల సంక్షేమంపట్ల చిత్తశుద్ధితో ఉన్నందునే తాము కేసీఆర్‌కు మద్దతిస్తున్నామని స్పష్టంచేశారు.