ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల కష్టాల్ని స్వయంగా తెలుసుకోవడం కోసం ఆరు నెలల పాటు సుధీర్ఘ పాద యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం శ్రీవారి నైవేద్యం సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. జగన్‌ను తిరుమల వేద పండితులు ఆశీర్వదించారు.
అయితే ఈ నెల 6వ తేదీ నుంచి ఇడుపుల పాయ నుంచి వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో వైఎస్ జగన్ తిరుమల చేరుకుని శ్రీవారికి మొక్కుకున్నారు. ప్రజాసంకల్ప యాత్ర విజయవంతం కావాలని ఆయన శ్రీవారిని కోరారు. జగన్ వెంట విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిధున్ రెడ్డి రోజా తదితరులు ఉన్నారు. రంగనాయకుల మండపం చేరుకున్న జగన్‌ను వేదపండితులు ఆశీర్వదించారు.
అయితే తాజాగా ప్రజాసంకల్ప యాత్ర కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు మార్చుకున్నారని, పలు తెలుగు మీడియా ఛానెల్స్‌తో పాటు సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి తెరలేపారు. దీంతో వెంటనే జగన్ పేరు మార్చుకుంటున్నట్లు వస్తున్న వార్తలను వైసీపీ నేతలు ఖండించారు. ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళుతుండడంతో పచ్చ శ్రేణులకు మింగుడు పడడం లేదని వైసీపీ శ్రేణులు మండిపడ్డాయి.
జగన్ పై అసూయతో రాస్తున్న నిరాధార వార్తలను నమ్మెద్దని ప్రజలతో పాటు, పార్టీ అభిమానులకు పార్టీ వర్గాలు విజ్ఞప్తి చేశాయి. ఇటువంటి అసత్య కథనాలను ప్రసారం చేయొద్దని మీడియాను కోరాయి. మరో వైపు పాదయాత్రను అడ్డుకోవడానికి.. పచ్చ బ్యాచ్ ఎన్ని కుట్రలు పన్నినా, ఆటంకాలు సృష్టించినా, ప్రజా సంక్షేమం కోసం జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ఆగదని వైసీపీ శ్రేణులు స్పష్టం చేశారు.